కొమ్మినేని ‘షో’ ఛానల్ మారింది బాస్

కొమ్మినేని ‘షో’ ఛానల్ మారింది బాస్

తెలుగు జర్నలిస్టులలో కాస్త గ్లామర్.. గ్రామర్ ఉన్న వారిలో కొమ్మినేని శ్రీనివాసరావు ఒకరు. ఈనాడు.. ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో సుదీర్ఘ కాలం పని చేసి.. తర్వాత టీవీ జర్నలిస్ట్ గా అవతారం ఎత్తటమేకాదు.. తన మాటలతో సామాన్య తెలుగు ప్రజల్ని తన వైపునకు తిప్పుకునేలా చేసుకున్న ఆయన పేరు చెప్పిన వెంటనే ఎన్ టీవీ గుర్తుకు వచ్చే పరిస్థితి. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలలో ఆయన ఛానల్ మారిపోయారు.

ఏపీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని.. తన షోలో చంద్రబాబు అవినీతి మీద ఆయన చేసిన విమర్శలతో బాబు ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించినట్లు చెబుతున్నారు. మరి ముఖ్యంగా.. అమరావతి భూముల వ్యవహారంలో బయటకు వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆయన వ్యాఖ్యలపై దుమారం చెలరేగటంతో పాటు.. ఎన్ టీవీ యాజమాన్యంపై ఒత్తిళ్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ వాదనకు బలం చేకూరేలా ఆ మధ్యన ఆయన ఏపీలో ఎన్ టీవీకి ఎదురవుతున్న ఇబ్బందుల గురించి.. తాను ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి రాసుకోవటం మర్చిపోకూడదు.

ఇదిలా ఉంటే తాజాగా ఆయన ఎన్ టీవీ నుంచి బయటకు వచ్చేశారు. ఊహించని విధంగా ఆయన సాక్షి ఛానల్ లో చేరారు. ఒక ఛానల్ నుంచి వేరే ఛానల్ కు మారటం పెద్ద విషయం కానప్పటికీ.. సీనియర్ జర్నలిస్ట్.. పేరు ప్రఖ్యాతులు ఉన్న ఆయన చానల్ మారటం విశేషమే. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సాక్షిలో ఇప్పటికే మరో సీనియర్ జర్నలిస్ట్ అమర్ ఉన్నారు. ఆయనకు ప్రాధాన్యత తగ్గకుండా.. కొమ్మినేని గౌరవ మర్యాదలకు ఢోకా లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఆయనకు వెల్ కం చెప్పినట్లుగా తెలుస్తోంది.

వ్యక్తిగత స్వేచ్ఛతో.. తనకు తోచినట్లుగా వ్యవహరించే కొమ్మినేని.. సాక్షికి ఎంతవరకూ సూట్ అవుతారన్న ప్రశ్న ఇప్పుడు జర్నలిస్ట్ సర్కిల్స్ లో జరుగుతోంది. అయితే.. తాను సాక్షిలో చేరటానికి ముందు.. కొమ్మినేని భారీ చర్చలు జరిపిన తర్వాతే ఛానల్ లో చేరేందుకు ఓకే చెప్పినట్లుగా చెబుతున్నారు. అయితే.. పరిమితుల చట్రాల మధ్య పని చేయాల్సిన నేపథ్యంలో కొమ్మినేని సాక్షిలో ఎంతమేర ఇముడుతారన్నది ఒక ప్రశ్న వినిపిస్తోంది. ఇలాంటివన్నీ తెలియక.. ముందుగా ఆలోచించకుండానే హడావుడిగా ఆయన చేరి ఉండరన్న మాట కూడా వినిపిస్తోంది. సో.. కొమ్మినేని షో వచ్చే ఛానల్ మారనుందన్న మాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు