కమల్.. రోజుకు 32 గుడ్లు

లోకనాయకుడు కమల్ హాసన్‌ను చూస్తే ఆయనకు 65 ఏళ్ల వయసని అంటే నమ్మడం కష్టం. ఈ వయసులోనూ చాలా ఫిట్‌గా కనిపిస్తారాయన. తన కెరీర్లో ఎప్పుడూ అసలు వయసు కంటే తక్కువగానే కనిపంచాడు కమల్. ఒకప్పుడు తాను ఫిట్నెస్ ఫ్రీక్ అని.. ఫిట్ గా ఉండటం కోసం రోజుకు 14 కిలోమీటర్ల దూరం పరుగులు తీసేవాడినని ‌ఆయన తాజాగా ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు.

ఐతే మధ్యలో తనకో యాక్సిడెంట్ జరగడంతో అంత దూరం పరుగెత్తలేని పరిస్థితి వచ్చిందని.. ఇప్పుడు కసరత్తులు కూడా తక్కువే చేస్తున్నానని కమల్ చెప్పాడు. ఐతే ఫిట్నెస్ మీద ఎంత దృష్టిపెట్టినా కూడా.. తాను తిండి విషయంలో అసలేమాత్రం నియంత్రణ పాటించేవాడిని కాదని.. ఒక సందర్భంలో తన తిండి చూసి దిగ్గజ నటుడు శివాజీ గణేషన్ ఆశ్చర్యపోయారని కమల్ గుర్తు చేసుకున్నాడు.

తన జీవితంలో ఒక సినిమాకు అత్యంత కష్టపడింది అంటే.. ‘అభయ్’ కోసమే అని కమల్ వెల్లడించాడు. ఆ సినిమాలో అభయ్ పాత్ర కోసం ముందు సన్నటి లుక్‌లో కనిపించాలని అనుకున్నానని.. కానీ తన మిత్రులు మాత్రం అలా ఉంటే బాగోదని అన్నారని.. దీంతో బరువు పెరగడానికి ప్రయత్నాలు చేశానని కమల్ తెలిపాడు. ఈ క్రమంలో రోజుకు 32 గుడ్లు తిన్నానని.. దీంతో పాటు ఉడికించిన చికెన్ కూడా తీసుకున్నానని.. దీనికి తోడు కసరత్తులు కూడా చేయడంతో భారీకాయుడిగా మారానని చెప్పాడు కమల్.

ఐతే ఆ సినిమా తర్వాత గుడ్లు అంటేనే అసహ్యం పుట్టి ఏడాది పాటు వాటి జోలికే వెళ్లలేదని కమల్ తెలిపాడు. సురేష్ కృష్ణ దర్శకత్వంలో కమల్ సొంత కథతో తెరకెక్కిన ‘అభయ్’కి అప్పట్లో ఓ రేంజ్ హైప్ వచ్చింది. కానీ కమల్ ఎంతో ఇష్టపడి, కష్టపడి చేసిన ఆ సినిమా అంచనాల్ని అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. కమల్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.