వీర్రాజు పై ఒత్తిడి పెంచేస్తున్న బండి

తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహారశైలి కారణంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై అనివార్యంగా ఒత్తిడి పెరిగిపోతోంది. మొదటినుండి కమలంపార్టీకి సంబంధించి తెలంగాణాకు ఏపిలో పరిస్ధితులకు చాలా వ్యత్యాసముంది. పార్టీ అంతో ఇంతో బలంగా ఉందంటే అది తెలంగాణాలో మాత్రమే అని అందరికీ తెలిసిందే. అలాంటి పార్టీలో బండి సంజయ్ అధ్యక్షుడు అయిన దగ్గర నుండి ఒక్కసారిగా జోరు పెరిగింది.

దానికితోడు దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో గెలవటం, గ్రేటర్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించటంతో బండి గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. నిజానికి దుబ్బాకలో కానీ గ్రేటర్ లో కానీ బండి వ్యూహాల వల్ల మాత్రమే పార్టీ మంచి ఫలితాలు సాధించలేదు. పార్టీకి టైం అలా కలసివచ్చిందంతే. సరే రిజల్టు ఏదైనా మంచి ఫలితాలు సాధించినపుడు బండి అధ్యక్షునిగా ఉన్నారు కాబట్టే క్రెడిట్ అంతా బండి ఖాతాలోనే పడింది.

ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్న బండి బీజేపీ కోణంలో వ్యూహాత్మకంగా మాట్లాడేస్తున్నారు. ఒకవైపు కేసీయార్ ను మరోవైపు ఎంఐఎంను టార్గెట్ చేసుకుని బండి చేస్తున్న ఆరోపణలు, విమర్శలతో తెలంగాణాలో రాజకీయంగా మంటలు మండుతున్నాయి. ఇక్కడే ఢిల్లీ నాయకత్వం బండి వ్యవహార శైలితో పోల్చి చూస్తున్నారుట సోమువీర్రాజు పనితీరును. దాంతో వీర్రాజు కూడా బండి లాగే మతపరమైన రాజకీయాలను చేయటానికి ప్రయత్నిస్తున్నారు. జనాల్లోని భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి తెగ ప్రయత్నిస్తున్నారు.

తెలంగాణాలో కేసీయార్ మీద జనాల్లో వ్యతిరేకత ఉంది. అలాగే ఎంఐఎం అంటే మెజారిటి జనాల్లో మంటుంది. కాకపోతే గట్టి ప్రత్యర్ధులు లేకపోవటంతో ఓల్డ్ సిటిలో ఎంఐఎం చెప్పిందే వేదంగా సాగిపోతోంది. ఇలాంటి పరిస్ధితుల్లో బండి మాట్లాడుతున్న మాటలు అక్కడ సరిపోతున్నాయి. కానీ ఏపి జనాల్లో జగన్మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి అయ్యి రెండేళ్లు కూడా కాకపోవడంతో పెద్దగా వ్యతిరేకత లేదు. అలాగే ఏపి మొత్తం మీద ఓల్డ్ సిటిలాంటిది టార్చిలైట్ వేసినా కనబడదు. మరి ఈ పరిస్దితుల్లో వీర్రాజు ఏ విధంగా భావోద్వేగాలు రెచ్చగొట్టగలరు ? అయినా.. అంతర్వేదిలో రథం దగ్దమని, రామతీర్ధమని ఇంకోటని, మరోటని నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ సెంటిమెంటును రగల్చడంలో మరి వీర్రాజు సక్సెస్ అవుతారా ?