షెడ్లో ఉన్న సినిమాలు బయటికొస్తున్నాయ్

షెడ్లో ఉన్న సినిమాలు బయటికొస్తున్నాయ్

వేసవిలో పెద్ద సినిమాల సందడి తెరపడింది. ‘అఆ’నే ఈ సీజన్లో వచ్చిన చివరి పెద్ద సినిమా. ఇక ఆగస్టులో ‘జనతా గ్యారేజ్’ వచ్చే వరకు భారీ సినిమాల సందడి ఉండదు. డబ్బింగ్ సినిమా ‘కబాలి’ని మినహాయిస్తే తెలుగులో రాబోయేవన్న చిన్న-మీడియం రేంజ్ సినిమాలే. సమ్మర్ సినిమాలు సైడైపోయాక రంగంలోకి దిగుదామని చాలా చిన్న సినిమాలు ఫస్ట్ కాపీలతో రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ షెడ్యూల్ అయి ఉన్న సినిమాలకు తోడు.. కాస్త క్రేజ్ తెచ్చుకుని ఆ తర్వాత కనుమరుగైపోయిన కొన్ని సినిమాలు కూడా వరుసగా థియేటర్లలోకి దిగడానికి రెడీ అవుతున్నాయి.

ఈ కోవలో ముందు చెప్పుకోవాల్సిన సినిమా ‘కుందనపు బొమ్మ’. ఎన్టీఆర్ మూవీ ‘నా అల్లుడు’తో దర్శకుడిగా పరిచయమై చాలా చెడ్డ పేరు తెచ్చుకుని.. ఆ తర్వాత ‘విశాఖ ఎక్స్‌ప్రెస్’తోనూ నిరాశ పరిచిన వర ముళ్లపూడి దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈయన గ్రేట్ డైరెక్టర్ బాపు అల్లుడు.. గ్రేట్ రైటర్ ముళ్లపూడి రమణకు తనయుడు. సుధాకర్, చాందిని చౌదరి జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేయబోతున్నట్లు ఉన్నట్లుండి ప్రకటించారు.

మరోవైపు ఆ మధ్య ఇంట్రెస్టింగ్ పోస్టర్లలో జనాల దృష్టిని ఆకర్షించిన ‘రోజులు మారాయి’ కూడా ఉన్నట్లుండి మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈ చిత్రాన్ని మారుతి-దిల్ రాజు సంయుక్తంగా నిర్మించడం విశేషం. ఈ నెల 11న ఆడియో రిలీజ్ చేసి.. త్వరలోనే సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మరోవైపు అల్లు అరవింద్ సమర్పణలో.. ‘నాన్నకు ప్రేమతో’ రైటర్ హుస్సేన్ షా దర్శకత్వం వహించిన ‘మీకు మీరే మాకు మేమే’ సినిమాను కూడా బయటికి తీస్తున్నారు. ఈ సినిమాను మార్చిలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వాయిదా వేసేశారు. జులైలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టబోతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు