ఆ సినిమా కూడా పోతే అడ్రస్ గల్లంతే

ఆ సినిమా కూడా పోతే అడ్రస్ గల్లంతే

టాలీవుడ్.. బాలీవుడ్.. కోలీవుడ్.. ఇలా మూడు పరిశ్రమల్లోనూ సూపర్ హిట్లు కొట్టిన ఘనత కాజల్ అగర్వాల్‌ది. ఒకప్పుడు ఈ మూడు భాషల్లోనూ ఆమె హవా సాగింది. కానీ ఏడాది కాలంగా ఆమెకు ఏమాత్రం కలిసి రావడం లేదు. ఇంతకుముందు హవా సాగించిన చోట్ల ఇప్పుడు వరుసగా ఆమె బేస్ కోల్పోతోంది. గత ఏడాది తమిళనాట ఆమె అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితి వచ్చింది. విశాల్‌తో చేసిన పాయుం పులి (జయసూర్య) యావరేజ్ అనిపించుకోగా.. ధనుష్ సరసన చేసిన 'మారి' పెద్ద ఫ్లాప్ అయింది. దీంతో తమిళంలో ఆమెకు అవకాశాలు ఆగిపోయాయి.

ఇక లేటెస్టుగా తెలుగులో ఆమెకు షాక్ మీద షాక్ తగిలాయి. తొలిసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' ఆమె కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. అది పోయినా మహేష్ ఉన్నాడు.. సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాడులే అని ఆశిస్తే 'బ్రహ్మోత్సవం'.. 'సర్దార్' రికార్డును బద్దలు కొట్టేసి మరింత పెద్ద డిజాస్టర్ అయి కూర్చుంది. దీంతో తెలుగులోనూ కాజల్ పరిస్థితి అయోమయంగా మారిపోయింది. ఫ్లాప్ డైరెక్టర్ తేజతో చేయబోయే సినిమా మినహా ఆమెకు మరో ఛాన్స్ లేదు. ఆ సినిమా కూడా పట్టాలెక్కుతుందో లేదో డౌటే అన్నట్లుంది పరిస్థితి.

ఇప్పుడిక కాజల్ బాలీవుడ్ మీద ఆశలు పెట్టుకుంది. రణదీప్ హుడాతో కలిసి ఆమె చేసిన 'దో లఫ్జోంకీ కహాని' సినిమా రాబోయే శుక్రవారమే విడుదల కానుంది. దీపక్ తిజోరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అంధురాలిగా నటించడం విశేషం. ఇది ఇంటెన్సిటీ ఉన్న లవ్ స్టోరీలాగా కనిపిస్తోంది. ఇంతకుముందు సింగం, స్పెషల్ చబ్బీస్ లాంటి సినిమాలు చేసినా కాజల్‌కు బాలీవుడ్లో పెద్దగా అవకాశాలు రాలేదు. హిట్లు కొట్టినప్పుడే పరిస్థితి అలా ఉంటే.. ఈసారి ఫ్లాప్ ఇస్తే ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. 'దో లఫ్జోంకీ..' ఆడకపోతే మొత్తంగా మూడు ఇండస్ట్రీల్లోనూ కాజల్ అడ్రస్ గల్లంతయిపోవడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు