బాబు కోరిక‌కు ప్ర‌భు ఖాత‌రు చేయ‌లేదా?

బాబు కోరిక‌కు ప్ర‌భు ఖాత‌రు చేయ‌లేదా?

కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభును ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎంపిక చేయడంతో రైల్వేజోన్ వచ్చేసినట్టేనన్న ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, రాజ్యసభకు తనను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియచేయడానికి విజయవాడకు వచ్చిన సురేష్ ప్రభు తాజాగా చేసిన వ్యాఖ్యలతో విశాఖకు రైల్వేజోన్ రావడం అంత సులభం కాదని తేలిపోయింది. విజయవాడకు వచ్చిన ప్రభు ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో వారిద్దరూ మాట్లాడారు. అయితే చిత్రంగా కేంద్రమంత్రి, ముఖ్యమంత్రి ఒకే వేదికపై విరుద్ధ ప్రకటనలు చేశారు. రైల్వే జోనే తమ ప్రాధాన్యమని చంద్రబాబు చెబితే సాంకేతిక సమస్యలున్నాయని ప్రభు తేల్చేశారు.

సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తమకు రైల్వే జోనే తొలి ప్రాధాన్యమని తెలిపారు. దీనివల్ల ఉద్యోగ, ఉపాధి కల్పనతోపాటు, పరిశ్రమలూ వస్తాయని తెలిపారు. విభజన సమయంలో జోన్ ప్రస్తావన ఉందని, దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే అనంతపురం ప్రాంతం నుండి త్వరగా విజయవాడ చేరుకునే విధంగా రైల్వేట్రాక్ వేయాలని కోరారు. రాష్ట్రంలో ఈస్ట్ జోన్ సరుకుల రవాణాకు అనుకూలంగా ఉంటుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పోర్టులకు రైల్, రోడ్డు కనెక్టివిటీతో ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ ట్రాన్స్పోర్ట్ కేంద్రంగా రాష్ట్రం అభివృద్ధి చెందగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ నుంచి ముంబయి పోర్టు కనెక్టివిటీతో పాటు ఢిల్లీ, ఖరగ్పూర్, కోల్కతాలకు సరుకు రైలు మార్గాలతో రాష్ట్రం ఎగుమతులు, దిగుమతులకు కేంద్రంగా మారుతుందన్నారు.

రాష్ట్రానికి రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని సురేష్ ప్రభు పేర్కొన్నారు. ఏపీకి రైల్వే జోన్ విషయంలో విభజన చట్టంలో గత యుపిఎ ప్రభుత్వం సరైన స్పష్టత ఇవ్వలేదన్నారు. జోన్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబుతో చర్చించామని, ఏపీకి రైల్వే జోన్ కేటాయించే విషయంలో త్వరలోనే స్పష్టత వస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో ఒక జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేసి రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టుల పనులను వేగవంతం చేస్తామని ప్రభు తెలిపారు. వాటి ప్రగతి గురించి రెండు, మూడు నెలలకోసారి స్వయంగా ముఖ్యమంత్రితో సమీక్ష నిర్వహిస్తానన్నారు. రాజధాని అమరావతితో పాటు అన్ని ప్రధాన నగరాలకు, రాష్ట్రంలో అన్ని పోర్టులకు రైల్ కనెక్టివిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అమరావతి నుంచి విశాఖపట్నం, చెన్నైలకు హైస్పీడ్ రైళ్ల ఏర్పాటుఉకటకు అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 21 రైల్వేస్టేషన్లను విమానాశ్రయాలకు ధీటుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. కర్నూలులో వర్క్షాపు, విశాఖలో వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు. వాటితో సుమారు రూ.600 కోట్లు పెట్టుబడులతో యువతకు ఉద్యోగాలొస్తాయన్నారు. రైల్వేశాఖ చేపట్టిన వివిధ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రానికి రూ.22,000 కోట్లు లబ్ధి చేకూరుతుందన్నారు. కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభు తెలిపారు.

మొత్తంగా ఒకేవేదికపై ఇద్దరు కీలక నేతలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పరిపాలనలో భాగస్వాములుగా ఉన్న రెండు పార్టీల ముఖ్యులు ఒకరికొకరు పొసగని విధంగా ప్రకటనలు చేయడం గురించి ప్రతిపక్షాలు ఇప్పటికే తమదైన శైలిలో విమర్శలు మొదలుపెట్టాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు