పవన్ డైరెక్టర్.. చించేశాడంటున్నారు

పవన్ డైరెక్టర్.. చించేశాడంటున్నారు

ఎస్.జె.సూర్య మనకు దర్శకుడిగానే తెలుసు. ‘ఖుషి’ సినిమాలో ఒకట్రెండు సార్లు కొన్ని క్షణాల పాటు తెరమీద కనిపించి మాయమవుతాడు తప్ప వేరే క్యారెక్టర్లేమీ వేసింది లేదు. ఐతే తమిళంలో మాత్రం అతను నటుడిగా చాలా సినిమాలు చేశాడు. తెలుగులో మహేష్ బాబుతో చేసిన ‘నాని’ని తమిళంలో అజిత్‌తో తీద్దామంటే అతను ఒప్పుకోలేదు. దీంతో తనే అనుకోకుండా హీరోగా మారి ఆ సినిమా చేశాడు. అది పెద్ద హిట్టయిపోయి సూర్యకు నటుడిగానూ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చాలా సినిమాలే చేశాడు సూర్య. ఐతే కెరీర్లో ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ ఓ ఎత్తయితే.. లేటెస్టుగా వచ్చిన ‘ఇరైవి’ మరో ఎత్తు అంటున్నారు కోలీవుడ్ జనాలు.

పిజ్జా, జిగర్ తాండా (చిక్కడు దొరకడు) లాంటి వైవిధ్యమైన సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్.. తన మూడో ప్రయత్నంగా చేసిన సినిమా ఇరైవి. ఇందులో ఎస్.జె.సూర్య ఓ దర్శకుడి పాత్రలో కనిపించాడు. తన సినిమా విడుదల కాలేదన్న ఫ్రస్టేషన్లో పచ్చి తాగుబోతుగా మారిపోయే పాత్ర ఇది. ఈ క్యారెక్టర్లో ఎస్.జె.సూర్య అదరగొట్టేశాడని అంటున్నారు. సూర్యలో ఇంతమంచి నటుడున్నాడా అంటూ అందరూ పొగిడేస్తున్నారు. రివ్యూలన్నింట్లో సూర్య మీద ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇది అవార్డ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ అని కితాబిస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో అతను చితక్కొట్టేశాడని.. అతడి కోసమే సినిమా చూడొచ్చని కూడా అంటున్నారు. సూర్యతో పాటు విజయ్ సేతుపతి, బాబీ సింహా, అంజలి, కమలిని ముఖర్జీ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు తమిళనాట అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులోకి కూడా అనువదించే అవకాశాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు