మన బాక్సాఫీస్‌ను వాళ్లు దున్నుకుంటున్నారు

మన బాక్సాఫీస్‌ను వాళ్లు దున్నుకుంటున్నారు

చంద్రముఖి.. అపరిచితుడు.. గజిని.. రోబో లాంటి సినిమాలు ఒకప్పుడు తెలుగు సినిమాలకు వణుకు పుట్టించాయి. మన స్టార్ హీరోల సినిమాల్ని డామినేట్ చేస్తూ తిరుగులేని వసూళ్లు సాధించాయి. ఆ టైంలో అనువాదాల మీద మనోళ్లకు భలే మోజుండేది. ఐతే అది రాను రాను తగ్గింది. భారీ అంచనాలతో వచ్చిన తమిళ డబ్బింగ్ సినిమాలు కొన్ని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడం.. మారిన మార్కెట్ స్ట్రాటజీల కారణంగా నెమ్మదిగా అనువాదాల జోరు తగ్గిపోయింది. అందులోనూ గత రెండు మూడేళ్లుగా తమిళ డబ్బింగ్ సినిమాల హవా పూర్తిగా తగ్గిపోయి.. ఏడాదిలో ఒకటీ అరా సినిమాలు మాత్రమే ఆడే పరిస్థితి వచ్చింది.

ఐతే ఈ ఏడాది ఉన్నట్లుండి మళ్లీ అనువాదాల జోరు కనిపిస్తోంది. వరుస ఫ్లాపులతో సతమతమైన సూర్య ‘24’ సినిమాతో చాన్నాళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఈ సినిమా తమిళంలో కంటే కూడా తెలుగులో మంచి వసూళ్లు సాధించి.. సూపర్ హిట్ స్టేటస్ సంపాదించింది. తెలుగులో ఈ సినిమా పాతిక కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసినట్లు అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చిన వారానికి వచ్చిన ‘బిచ్చగాడు’ ఈ ఏడాదిలోనే అతి అత్యంత ఆశ్చర్యకరమైన హిట్ అని చెప్పాలి. ఈ సినిమా విడుదలవుతున్న సంగతే జనాలు పట్టించుకోలేదు. పెద్దగా పబ్లిసిటీ కూడా చేయలేదు.

కానీ కేవలం మౌత్ టాక్‌తో జనాల్లోకి వెళ్లిపోయిన ‘బిచ్చగాడు’ ఆశ్చర్యకరమైన వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.7 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసినట్లు చెబుతున్నారు. ఫుల్ రన్లో రూ.10 కోట్ల దాకా వసూలు చేస్తుందని అంచనా. ఈ సినిమా హవా సాగుతుండగానే.. విశాల్ మూవీ ‘రాయుడు’ వచ్చి బాగానే దండుకుంది. ఇది రొటీన్ మాస్ మసాలా సినిమానే అయినప్పటికీ మంచి సీజన్లో పోటీ లేకుండా విడుదల కావడంతో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి వారాంతంలో ఈ చిత్రం రూ.5 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. మొత్తానికి ఈ సమ్మర్లో భారీ అంచనాలతో వచ్చిన కొన్ని తెలుగు సినిమాలు బోల్తా కొట్టగా.. తమిళ సినిమాలు అనూహ్యమైన వసూళ్లతో అదరగొట్టాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు