నిమ్మగడ్డ నిర్ణయానికి వ్యాక్సినేషన్ అడ్డు పడుతోందా ?

పంచాయితీ ఎన్నికల నిర్వహణ విషయంలో స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయానికి వ్యాక్సినేషన్ ప్రోగ్రామే అడ్డుగా నిలుస్తుందా ? తాజాగా కేంద్రం జారీ చేసిన ఆదేశాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఈనెల 16వ తేదీ నుండి కరోనా వైరస్ విరుగుడు వ్యాక్సినేషన్ దేశమంతా మొదలవుతోంది. ఈ కార్యక్రమానికి అన్నీ రాష్ట్రాలు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోడి రాష్ట్రాలను ఆదేశించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం చివరకు చిన్నారులకు వేసే పోలియో డ్రాపుల కార్యక్రమంలో కూడా మార్పులుచేసింది.

నిజానికి కరోనా వైరస్ మహమ్మారికి విరుగుడు టీకా ఎప్పుడెస్తుందా అని యావత్ ప్రపంచం ఎంతో ఆతృతుగా ఎదురు చూస్తోంది. అలాంటి సమయం ఈనెల 16 నుండి మొదలవుతోంది. వ్యాక్సినేషన్ మొదటిదశలో దేశంలోని 30 కోట్లమందిని గుర్తించింది కేంద్రం. సరే ఈ 30 కోట్లలోనే మనరాష్ట్రంలోని సుమారు 3 కోట్లమంది జనాలున్నారు. వీరిలో కరోనాతో మొదటి నుండి పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ పోలీసులు, వైద్యారోగ్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, హెల్త్ వర్కర్లు, ఆశావర్కర్లు ఇలా చాలామందున్నారు.

నిమ్మగడ్డ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికల ప్రక్రియ మొదలయ్యేది 17వ తేదీనుండి. అంటే వ్యాక్సినేషన్ మొదలైన తేదీ మరుసటి రోజే ఎన్నికల ప్రక్రియ కూడా మొదలవుతోంది. నిజానికి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ తో పోల్చుకుంటే ఎన్నికల ప్రక్రియ అంత ముఖ్యమేమీకాదు. కాబట్టి కచ్చితంగా ఎన్నికలు వాయిదా పడేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు నిమ్మగడ్డ ఎంత పట్టుదలగా ఉన్నారో వాయిదా విషయంలో ప్రభుత్వం అంటే పట్టుదలగా ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరపాలనేందుకు నిమ్మగడ్డ కారణాలు చూపలేకపోతున్నారు.

ఇదే సమయంలో ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదని ప్రభుత్వం అనేక కారణాలను చెబుతోంది. వాటిల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ఒకటి. మొన్నటి నిమ్మగడ్డ-చీఫ్ సెక్రటరీ అండ్ కో భేటీలో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అయినా నిమ్మగడ్డ పట్టించుకోకుండా తనిష్టం వచ్చినట్లుగా నోటిఫికేషన్ జారీ చేసేశారు. పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయిన మరుసటి రోజే వ్యాక్సినేషన్ తేదీని ప్రధానమంత్రి ప్రకటించారు.

సో క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలను చూసిన తర్వాత కోర్టు కూడా ఎన్నికలను నిర్వహించాలని చెప్పే అవకాశాలు లేవనే అనిపిస్తోంది. కాబట్టి వ్యాక్సినేషన్ కార్యక్రమం అయిపోయేంతవరకు స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ సాధ్యం అయ్యేట్లు లేదు. పిట్ట పోరు పిట్టపోరు ఇంకెవరో తీర్చినట్లుగా ప్రభుత్వం-నిమ్మగడ్డ వివాదాన్ని కేంద్రప్రభుత్వం తీర్చబోతున్నట్లుంది. మరి ప్రధానమంత్రి ప్రకటనతో స్ధానిక సంస్ధల వివాదం శాశ్వతంగా పరిష్కారం అయినట్లేనా ?