తెరవెనుక కథ: బ్రహ్మోత్సవం ఎలా దారి తప్పిందంటే

తెరవెనుక కథ: బ్రహ్మోత్సవం ఎలా దారి తప్పిందంటే

బ్రహ్మోత్సవం గురించి ఎక్కువ మంది చేస్తోన్న కామెంట్‌... తల, తోక లేదని.

బ్రహ్మోత్సవం గురించి చాలా మంది ఇస్తోన్న కంప్లయింట్‌... అర్థం కాలేదని.

ఒక సాధారణ కుటుంబ కథా చిత్రంలో సగటు సినీ ప్రియుడికి అర్థం కానంత గందరగోళం ఏముంటుంది? ఇదేదో సగటు ప్రేక్షకుల ఐక్యూకి అందని సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా కాదే. కుటుంబ విలువలు, బంధాలు, అనుబంధాల ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం చూసిన వాళ్లని కదిలించకపోగా ఎందుకని నవ్వుల పాలవుతోంది? ఎన్నడూ లేనిది ఒక ఫ్యామిలీ సినిమాని ఎందుకని ప్రతి ఒక్కరూ తమ, తమ స్థాయిలో కామెడీ చేస్తున్నారు?

Watch Srikanth Addala Speaking About Brahmotsavamఈ సినిమా కథేంటనేది చెప్పడం నూటికి ఎనభై మంది వల్ల కావడం లేదు. తెలుగు సినిమా తెలుగు ప్రేక్షకులకే అర్థం కాలేదంటే, అసలు ఈ కథని మహేష్‌బాబులాంటి పెద్ద స్టార్‌కి శ్రీకాంత్‌ అడ్డాల ఎలా చెప్పి ఒప్పించాడు? ఇంత అవకతవక కథని మహేష్‌ ఎందుకు ఓకే చేసాడంటూ వీరాభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాంత్‌ అడ్డాల చెప్పిన కథనే విని మహేష్‌ ఓకే చేసాడా? లేక 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తీసినవాడేనని మైండ్‌లో ఫిక్స్‌ అయి, బ్లైండ్‌గా వెళ్లిపోయాడా?

బ్రహ్మోత్సవం కథ ఇంతగా దారి తప్పడానికి, ఆది, అంతం లేని గందరగోళంగా మారడానికి గల కారణాలేమై వుంటాయని ఆరా తీసే ప్రయత్నం చేయగా... అసలు ఈ కథేంటి, అసలేం తీద్దామనుకున్నారు, ఎందుకని సినిమా అతుకుల బొంతలా తయారైందనే ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి.

Watch: Srikanth Addala speaks about Brahmotsavam After Release
అసలింతకీ బ్రహ్మోత్సవం కథేమిటంటే...

సత్యరాజ్‌ ఒక అనాధ. తనకి అందరూ వుండాలని, ఎప్పుడూ నలుగురితో కలిసి ఆడి పాడుతూ తన ఇల్లంతా కళ కళలాడిపోతూ వుండాలని కోరుకుంటాడు. నలుగురు తమ్ముళ్లున్న రేవతిని ఏరి కోరి మరీ పెళ్లి చేసుకుంటాడు. అయితే రేవతి వారికి సవతి సోదరి. అయినప్పటికీ తన సవతి సోదరులని సొంతవాళ్లలా చేరదీసి తన ఎదుగుదలలో వారినీ భాగస్తులని చేస్తాడు. అందరి కుటుంబాలు కలిసి ప్రతి వేడుకనీ అద్భుతంగా జరుపుకుంటూ వుంటారు. ఏటా రెండుసార్లు శ్రీనివాస కళ్యాణం జరిపించడం ఆనవాయితీగా పాటిస్తారు. కానీ రావు రమేష్‌కి ఇదంతా నచ్చదు. తనకంటూ ఒక గుర్తింపు లేకుండా బావ నీడలో బతకలేక ఒకసారి తన ఆక్రోశాన్ని బయటపెట్టేస్తాడు. అందరూ కలిసి వుండాలని కోరుకునే సత్యరాజ్‌ ఏ ఒక్కరినీ వదులుకోకూడదని కొడుక్కి చెప్తాడు. లోపాలున్నా కానీ మనవాళ్లని దూరం చేసుకోకూడదని అంటూనే చివరి శ్వాస విడుస్తాడు. తండ్రి చనిపోయిన సమయంలో ఆ ఇంట్లో ఒక్కరు కూడా కనిపించకపోవడం మహేష్‌ని కలచి వేస్తుంది. వాళ్లనీ వీళ్లనీ కలుపుకోవాలని చూసిన తండ్రికి సొంత వాళ్లు ఎందుకు లేరు? వుంటే వారంతా ఏమయినట్టు? తన తండ్రి మూలాలని వెతుక్కుంటూ బయల్దేరతాడు. ఆ ప్రయాణంలో మహేష్‌ జీవితాన్ని తెలుసుకుంటాడు. అనిపించినది అనేయడమే తప్ప ఆలోచించడం ఎరుగని తాను గొల్లపూడి, చావుబతుకుల్లో ఉన్న పాప, నాజర్‌ తదితర పాత్రల ద్వారా జీవితమంటే ఏంటనేది తెలుసుకుంటాడు. మన వాళ్లలో ఎవరినీ దూరం చేసుకోరాదని తండ్రి చనిపోయే ముందు చెప్పినదానికి అర్థమేంటో గ్రహిస్తాడు. అందుకే తనని దూరం పెట్టిన మేనమామ దగ్గరికే వెళ్లి తమని తనతో వుండనివ్వమని అర్థిస్తాడు. తన తండ్రి స్థానాన్ని తీసుకుని కుటుంబాన్ని ఎప్పటిలా నడిపించమని కోరతాడు. అప్పుడు కానీ ఆ తండ్రీ కొడుకుల గొప్పతనం ఏంటనేది, తన మూర్ఖత్వం ఎంతనేది రావు రమేష్‌ తెలుసుకోడు.

కథా పరంగా కన్‌ఫ్యూజన్‌ ఏమీ లేదు. పైగా కుటుంబ కథా చిత్రాల్లో వుండే మూస పోకడలు లేకుండా కథాగమనం కూడా కొత్తగానే అనిపించింది. మహేష్‌ ఈ కథని ఎంచుకోవడంలో ఎలాంటి పొరపాటు చేయలేదు. నిజంగానే సత్తా వున్న కథ ఇది. కాకపోతే ఈ చిత్రాన్ని రెండున్నర గంటల నిడివిలో చెప్పడం శ్రీకాంత్‌ అడ్డాలకి చేతకాలేదు. అందుకే తనకి తోచింది, నచ్చింది అంతా తీసుకుంటూ పోయాడు. కానీ ఎడిటింగ్‌ చేసి చూసుకున్నాక దాదాపు రెండు సినిమాలకి సరిపడే ఫుటేజీ తేలిందట. దాంతో రీఎడిటింగ్‌ల మీద రీఎడిటింగ్‌లు చేసుకుంటూ రెండున్నర గంటలకి తీసుకొచ్చారు. దర్శకుడిగాశ్రీకాంత్‌ అడ్డాలకి, కథానాయకుడిగా మహేష్‌కి ఈ కథేంటనేది బాగా తెలుసు. కనక్టింగ్‌ సీన్లు ఎన్నో ఎడిటింగ్‌లో తీసి పారేస్తున్నా కానీ తమకి కథ తెలుసు కనుక ఎలాంటి కన్‌ఫ్యూజన్‌ లేకుండా ముందుకి సాగిపోతోందనే అనుకున్నారు. కానీ తమకి తెలిసిన కథ ప్రేక్షకులకి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం జరగలేదు. కనీసం సినిమా ఫైనల్‌ కట్‌ వచ్చాక అయినా వాయిస్‌ ఓవర్‌ లాంటిది ఏదైనా పెట్టి కథేంటి అన్నది క్లుప్తంగా వివరించి ఉండాల్సింది. అలాంటి చిన్న చిన్న కరక్షన్లు జరిగి వున్నా కానీ ఫైనల్‌ ప్రోడక్ట్‌ షేప్‌ మారిపోయి వుండేది. అందరికీ కాకపోయినా కనీసం క్లాస్‌ ఆడియన్స్‌కి అయినా సినిమా మీనింగ్‌ఫుల్‌గా అనిపించేది.సీన్లకి సీన్లు కట్‌ చేసుకుంటూ వెళ్లిపోవడం, ప్రత్యేకించి కామెడీ కానీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ కానీ లేదు కనుక మ్యూజిక్‌ బిట్లు, సాంగ్స్‌ మాత్రం అన్నీ వుంచాలని ఫిక్సవడం వల్ల పాటల మధ్య సినిమా వస్తోన్న భావన కలిగింది. కనీసం పాత్రల పరిచయానికి అయినా ఒక రెండు నిమిషాలు కేటాయించినట్టయితే ఎవరికి ఎవరు ఏమవుతారనేది అర్థమై వుండేది. కాజల్‌ ముందు సీన్లో వాళ్ల నాన్నతో 'ఇండియాలో వుండిపోతా' అని చెప్తుంది. తదుపరి సీన్లో మహేష్‌తో తెగతెంపులు చేసుకుంటుంది. తండ్రి చనిపోయినా కానీ విదేశాల్లో ఉన్న మహేష్‌ అక్క రాలేదనేది మరో విమర్శ. నిజానికి ఆమె వస్తుందట. ఆ సీన్‌ కూడా చిత్రీకరించినా ఎడిటింగ్‌లో తొలగించారట. ఇదంతా నిడివి తగ్గించే క్రమంలో కీలకమైన సన్నివేశాలని తొలగించడం వల్లేనని తెలిసింది. మహేష్‌లాంటి స్టార్‌ని ఒక బాయ్‌ నెక్స్‌ట్‌ డోర్‌ మాదిరిగానే చూపించాలనే ప్రయత్నం బెడిసికొట్టింది. దీంతో వీరాభిమానుల నుంచి కూడా నిరసన జ్వాలలు పెల్లుబుకుతున్నాయి. ఫైనల్‌ కట్‌కే సినిమా అతుకుల బొంతలా వుందంటే, మొదటి రోజు వచ్చిన విమర్శలతో మరో ఇరవై నిమిషాల వరకు నిడివి తగ్గించారు. దాని వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.

ఇప్పటికి జరిగిపోయిన డ్యామేజీని కంట్రోల్‌ చేయడం కానీ, బ్రహ్మోత్సవం ఫలితాన్ని మార్చడం కానీ జరిగే పనులు కావు. ఎదురు డబ్బులిచ్చినా థియేటర్లకి వెళ్లడానికి ఆలోచించేంత స్థాయిలో నెగెటివ్‌ ప్రచారం జరిగిపోయింది కనుక ఇక దాని ఫలితం గురించి ఆలోచించి కూడా అనవసరమే. అయితే కనీసం తాము అనుకున్న సినిమా థియేట్రికల్‌ కట్‌కి వచ్చేసరికి ఏ విధంగా షేప్‌ తీసుకుందనేది అర్థమయ్యేలా కనీసం డివిడిలో అయినా డైరెక్టర్స్‌ కట్‌ అంటూ బ్రహ్మోత్సవంని చూపించినట్టయితే కనీసం ఏ విలువల కోసమైతే సినిమాని తలపెట్టారో దానికి కాస్తయినా న్యాయం జరుగుతుంది.

Watch: Srikanth Addala Speaks About Brahmotsavam


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు