ఒక హీరో.. మాజీ ప్రేయసి.. ఆమె ప్రియుడు

ఒక హీరో.. మాజీ ప్రేయసి.. ఆమె ప్రియుడు

ఎంత సినిమా వాళ్లయినా ఒకమ్మాయితో ఒకసారి బ్రేకప్ అయిపోయాక తన ప్రేయసితో మళ్లీ కలవడానికి పెద్దగా ఇష్టపడరు. ఐతే హర్షవర్ధన్ రాణె మాత్రం తన మాజీ ప్రేయసితో కలిసి ఒకే ఇంట్లో ఉన్నట్లు చెబుతున్నాడు. అంతే కాదు.. అదే ఇంట్లో ఆమె కొత్త ప్రియుడు కూడా ఉంటున్నాడట. తాము ముగ్గురం కలిసి ముంబయిలో ఒకే అపార్ట్మెంట్ తీసుకుని అందులో ఉంటున్నట్లుగా వెల్లడించాడు రాణె.

తెలుగులో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో ఎక్కువగా నటించిన హర్షవర్ధన్.. ఈ మధ్యే బాలీవుడ్ అవకాశాలు రావడంతో ముంబయికి షిఫ్ట్ అయిపోయిన సంగతి తెలిసిందే. అతడి తొలి బాలీవుడ్ సినిమా ‘సనమ్ తేరే కసమ్’ ఈ మధ్యే రిలీజై ఓ మోస్తరుగా ఆడింది. ఇప్పుడతడి చేతిలో ఇంకో రెండు మూడు సినిమాలున్నాయి. ఐతే ముంబయిలోనే సెటిలైపోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌కు టాటా చెప్పేశాడని.. ఇక్కడ ఉన్న తన ఇల్లును కూడా అమ్మేశాడని మీడియాలో వార్తలొచ్చాయి.

ఈ వార్తలపై స్పందిస్తూ.. ‘‘నాకు హైదరాబాద్‌లో ఇల్లా.. అలాంటిదేమీ లేదు. అక్కడే కాదు.. నాకు ముంబయిలో కూడా ఇల్లు లేదు. అసలు నాకు ఎక్కడా ఇల్లు కొనడం ఇష్టం లేదు. హైదరాబాద్‌లో ఉన్నపుడు ఎక్కువగా హోటల్స్‌లోనే ఉండేవాడిని. ముంబయిలో నేను, నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్.. ఆమె ప్రస్తుత బాయ్ ఫ్రెండ్ కలిసి ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాం’’ అంటూ షాకిచ్చాడు హర్షవర్ధన్ రాణె. ఎంతైనా రాణె బాబుది చాలా విశాలమైన హృదయం కదా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు