బాలయ్య ఫ్యాన్స్‌ను కెలుకుతున్న కళ్యాణ్

బాలయ్య ఫ్యాన్స్‌ను కెలుకుతున్న కళ్యాణ్

ఇంతకుముందు టాలీవుడ్లో ఒక ఫ్యామిలీకి చెందిన హీరోల అభిమానులు.. ఇంకో ఫ్యామిలీ హీరో అభిమానులతో గొడవ పడేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఒకే ఫ్యామిలీ హీరోల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అభిమానుల మధ్య వార్ నడుస్తోంది. మెగా ఫ్యామిలీ అభిమానుల్లో ప్రస్తుతం నడుస్తున్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరోవైపు నందమూరి ఫ్యాన్స్‌లో నడుస్తున్న ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు తీవ్ర రూపం దాలుస్తున్నట్లు సమాచారం.

నందమూరి అభిమానులందు ఎన్టీఆర్ అభిమానులు వేరయా అని ఇప్పటికే రుజువైంది. సంక్రాంతి సందర్భంగా నందమూరి అభిమానులు రెండు వర్గాలుగా చీలిపోయాయి. గ్రౌండ్ లెవెల్లో ఈ రెండు వర్గాల మధ్య గొడవలు కూడా జరిగాయి. ఇలాంటి టైంలో కళ్యాణ్ రామ్ తన కొత్త సినిమాలో బాలయ్య పాటను రీమిక్స్ చేయాలనుకుంటున్నట్లు వస్తున్న వార్తలు బాలయ్య అభిమానుల్లో కాక పుట్టిస్తున్నాయి. ఇంతకుముందు కళ్యాణ్ రామ్ విషయంలో బాలయ్య ఫ్యాన్స్‌కు సాఫ్ట్ కార్నర్ ఉండేది. అప్పుడు కళ్యాణ్.. ఎన్టీఆర్‌కు దూరంగా.. బాలయ్యకు దగ్గరగా ఉండేవాడు.

కానీ ఈ మధ్య సీన్ మారిపోయింది. బాలయ్యకు దూరమై.. తమ్ముడికి బాగా దగ్గరైపోయాడు కళ్యాణ్. హరికృష్ణ-ఎన్టీఆర్-కళ్యాణ్ కలిసి తమది ప్రత్యేకమైన వర్గం అని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య అభిమానులకు కళ్యాణ్ కూడా శత్రువుగా మారిపోయాడు. ఇలాంటి తరుణంలో బాలయ్య పాటను కళ్యాణ్ రామ్ వాడుకోవడానికి వాళ్లు ఆక్షేపిస్తున్నారు. ‘పటాస్’లో అరివో సాంబా పాటను రీమిక్స్ చేసి బాగానే లాభపడ్డాడు కళ్యాణ్. ఆ పాటను బాలయ్య అభిమానులు కూడా బాగానే ఎంజాయ్ చేశారు. కానీ అప్పటికి ఇప్పటికి పరిస్థితులు వేరు. మరి కళ్యాణ్ నిజంగానే బాలయ్య పాటను రీమిక్స్ చేస్తే.. ఆయన ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు