సీనియర్ కమెడియన్ ఛానెల్ పెడుతున్నాడు

సీనియర్ కమెడియన్ ఛానెల్ పెడుతున్నాడు

అవును సీనియర్ కమెడియన్ ఎల్బీ శ్రీరాం ఛానెల్ పెడుతున్నాడు. ఎల్బీ దగ్గర అన్ని డబ్బులున్నాయా.. అంత అనుభవముందా అని ఆశ్చర్యపోకండి. ఆయన పెడుతోంది టీవీ ఛానెల్ కాదు. యూట్యూబ్ ఛానెల్ మాత్రమే. రచయితగా పరిశ్రమలోకి అడుగుపెట్టి.. ‘చాలాబాగుంది' సినిమాతో నటుడిగానూ స్థిరపడి పాతికేళ్లకు పైగా సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ఎల్బీ.. ఈ ట్రెండుకు తగ్గట్లుగా అప్ డేట్ అవుతున్నారు. యూట్యూబ్ ఛానెల్ పెట్టి షార్ట్ ఫిలిమ్స్ తీసి అందులో ప్రదర్శించాలని ఆశపడుతున్నారు. ఎల్.బి. క్రియేష‌న్స్ బ్యాన‌ర్ మీద ఆయన వరుసగా షార్ట్ ఫిలిమ్స్ తీయబోతున్నారట. ఇక్కడ ఎల్.బి. అంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అట. ఆ కాన్సెప్ట్ మీదే షార్ట్ ఫిల్మ్స్ తీస్తారట ఈ సీనియర్ రచయిత కమ్ కమెడియన్.

తన కొత్త ప్రయత్నం గురించి ఎల్బీ శ్రీరాం స్పందిస్తూ.. ‘‘నాలో విజ‌యం తెచ్చిన గ‌ర్వం లేదు కానీ దాని వల్ల వచ్చిన గౌరవం ఉంది. కొత్త‌గా ఇంకా ఏదో చేయాలి అనే త‌ప‌న ఉంది. క‌డుపు నింప‌డానికి క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు వ‌స్తుంటాయి. కానీ మ‌న‌సు నింప‌డానికి ఏదైనా చేయాలి. కాలానికి తగ్గట్లుగా మారాలి. అందుకే నేడు ప్ర‌పంచాన్ని ఏలుతున్న ఇంట‌ర్నెట్ రంగంలోకి అడుగుపెడుతున్నాను. నా భావాలు ఈత‌రం వాళ్ల‌కు విసుగు తెప్పించకూడదని షార్ట్ ఫిల్మ్స్ ఎంచుకున్నాను. నా ఫీలింగ్స్ గుండెలోంచి వ‌చ్చిన‌వి కాబ‌ట్టే ఈ షార్ట్ ఫిల్మ్స్‌కు హార్ట్ ఫిల్మ్స్ అని పేరు పెట్టుకున్నాను. మే 30 నా పుట్టిన‌రోజు. ఆ రోజు నా సెకండ్ ఇన్సింగ్స్ మొదలవుతుంది'' అని చెప్పారు. ఈ సీనియర్ కమెడియన్ చేస్తున్న ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు