ఔను.. ఆ సినిమా చేస్తున్నా-సమంత

ఔను.. ఆ సినిమా చేస్తున్నా-సమంత

‘ఏమాయ చేసావె’ సినిమా పుణ్యాన ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది సమంత. రెండో సినిమాకే మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసిన ఆమె.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. అన్నీ పెద్ద పెద్ద సినిమాల్లోనే నటించింది. ఏవైనా ప్రయోగాలు చేద్దామన్న ఆలోచన కూడా రానివ్వకుండా భారీ అవకాశాలతో ఆమెను ముంచెత్తారు. ఐతే ఇప్పటికీ అవకాశాలకు లోటేమీ లేనప్పటికీ.. హీరోయిన్‌గా తనకంటూ ఓ ఇమేజ్ వచ్చిన నేపథ్యంలో కొంచెం భిన్నమైన సినిమా ఒకటి చేద్దామని ఫిక్సయినట్లుంది సమంత. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే తాను కన్నడ సినిమా ‘యు-టర్న్’ రీమేక్‌లో నటించబోతున్నట్లు కన్ఫమ్ చేసింది సమంత.

‘లూసియా’ అనే వైవిధ్యమైన సినిమాతో ప్రపంచ స్థాయిలో పేరు సంపాదించిన కన్నడ దర్శకుడు పవన్ కుమార్.. దర్శకుడిగా తన రెండో ప్రయత్నంలో తీసిన సినిమానే ‘యు-టర్న్’. అతడి తొలి సినిమాలాగే ఇది కూడా ఓ సైకలాజికల్ థ్రిల్లర్. ఇంకా విడుదల కాకుండానే సమంతకు ఈ సినిమా మీద గురి కుదిరింది. తన మాజీ ప్రియుడు సిద్ధార్థ్ ‘లూసియా’ను తమిళంలో రీమేక్ చేసిన టైంలో పవన్ టాలెంట్ గురించి తెలుసుకున్న సామ్.. ఈ మధ్యే తన మిత్రుడు నాగచైతన్యతో కలిసి బెంగళూరు వెళ్లి ‘యు-టర్న్’ చూసి వచ్చింది. ఇది ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ. దీన్ని తమిళ, కన్నడ భాషల్లో తాను ప్రధాన పాత్రలో రీమేక్ చేయబోతున్నట్లు కన్ఫమ్ చేసింది సమంత. ఐతే తనే ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు వచ్చిన వార్తల్ని మాత్రం ఆమె ఖండించింది. ‘‘అవును.. యు-టర్న్ రీమేక్‌లో నటించబోతున్నా. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. నా కెరీర్ మొత్తంలో అత్యంత వైవిధ్యమైన సినిమా ఇదే అవుతుంది. కానీ నేనే ఈ సినిమాను నిర్మిస్తానన్నది వాస్తవం కాదు’’ అని సమంత చెప్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు