చరణ్.. సీక్వెల్ కూడా వచ్చేస్తోందయ్యో

చరణ్.. సీక్వెల్ కూడా వచ్చేస్తోందయ్యో

గత ఏడాది తమిళంలో ఏ అంచనాలు లేకుండా విడుదలై సెన్సేషనల్ హిట్టయిన సినిమా తనీ ఒరువన్. వరుస ఫ్లాపుల్లో ఉన్న జయం రవిని హీరోగా నిలబెట్టడమే కాదు.. రీమేక్ డైరెక్టర్‌గా గుర్తింపు ఉన్న అతడి అన్న మోహన్ రాజాకు కూడా దర్శకుడిగా ఒక కొత్త ఇమేజ్ తెచ్చిపెట్టిందీ సినిమా. రూ.50 కోట్లకు పైగా వసూళ్లతో గత ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్లలో ఒకటిగా నిలిచిన ‘తనీ ఒరువన్’ను రీమేక్ చేయడం కోసం చాలా భాషల నుంచి ఆఫర్లొచ్చాయి. ఐతే ముందుగా కర్చీఫ్ వేసింది మాత్రం తెలుగు నుంచే. సినిమా విడుదలైన వారం రోజులకే రీమేక్ రైట్స్ కూడా తీసేసుకున్నారు. ఆ రైట్స్ చేతులు మారి చివరికి అల్లు అరవింద్ చేతికి చిక్కాయి. రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ రీమేక్ మొదలైంది.

‘ధ్రువ’ అనే వర్కింగ్ టైటిల్‌తో ‘తనీ ఒరువన్’ రీమేక్ షూటింగ్ జరుపుకుంటోంది. ఐతే ఈ సినిమా తెలుగులో విడుదలైన కొన్ని నెలలకే తమిళంలో ‘తనీ ఒరువన్’ సీక్వెల్ మొదలైపోతుండటం విశేషం. జయం రవి 25వ సినిమాగా ‘తనీ ఒరువన్-2’ తెరకెక్కిస్తానని ప్రకటించాడు మోహన్ రాజా. ప్రస్తుతం మోహన్ రాజా.. రైజింగ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. జయం రవి వేరే ఇంకో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తయ్యాక ‘తనీ ఒరువన్-2’ సెట్స్ మీదికి వెళ్తుంది. ఇప్పటికే తన రచయితల బృందంతో కలిసి స్క్రిప్టు తయారు చేసే పనిలో ఉన్నాడు మోహన్ రాజా. మరి రామ్ చరణ్ ‘తనీ ఒరువన్’ సీక్వెల్‌లో సైతం నటిస్తాడేమో చూడాలి. ఐతే ‘ధ్రువ’ రిజల్ట్‌ను బట్టే అతను నిర్ణయం తీసుకునే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు