త్రివిక్రమ్ చెప్పకనే చెప్పేశాడే..

త్రివిక్రమ్ చెప్పకనే చెప్పేశాడే..

మహేష్.. పవన్ కళ్యాణ్.. అల్లు అర్జున్ లాంటి బడా స్టార్లతో సినిమాలు చేసిన త్రివిక్రమ్.. ‘అ..ఆ’ సినిమాకు నితిన్‌ను హీరోగా ఎంచుకోవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. నితిన్ పక్కన సమంతను హీరోయిన్ గా పెట్టడం కూడా కాస్త ఎక్కువగానే అనిపించింది జనాలకు. ఐతే ‘అ..ఆ’ ఫస్ట్ లుక్ పోస్టర్లో నితిన్‌ను వెనకనుంచి చూపించి.. సమంతను హైలైట్ చేశాక జనాలకు జస్టిఫికేషన్ దొరికింది. ఇది హీరోయిన్ డామినేటెడ్ మూవీ అని.. కథంతా సమంత చుట్టూనే తిరుగుతుందని జనాలు ఓ అంచనాకు వచ్చేశారు. ఇక తాజాగా ‘అ..ఆ’ టీజర్, ట్రైలర్ చూశాక.. ఆడియో వేడుకలో త్రివిక్రమ్ మాటలు విన్నాక జనాల అనుమానమే నిజమని తేలిపోయింది.

‘అ..ఆ’ టీజర్‌తో పాటు ట్రైలర్లో సైతం నరేషన్ అంతా సమంత పాత్ర ద్వారానే జరిగింది. రెండింట్లోనూ సమంతే హైలైట్ అయింది. నితిన్ ఉన్న సంగతే తెలియట్లేదు. ట్రైలర్లో ఒకే ఒక్క డైలాగ్ చెప్పాడు నితిన్. త్రివిక్రమ్ గత సినిమాల్లో లాగా ట్రైలర్లో హీరో ఎలివేషన్ ఏమాత్రం కనిపించలేదు. సమంత హావభావాలు.. మేనరిజమ్స్ క్యాచ్ చేయడం చూస్తే ఇదేదో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలాగా అనిపించింది. పైగా త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘‘ఇందులో హీరో పాత్రకు ప్రాధాన్యం ఎక్కువా.. లేక హీరోయిన్ పాత్రకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారా అని ఆలోచించకుండా కథను మాత్రమే నమ్మి సినిమా చేసిన నితిన్‌కు థ్యాంక్స్’’ అనడం నితిన్ పాత్ర విషయంలో ఉన్న సందేహాలకు మరింత బలం చేకూర్చింది. సినిమాలో నితిన్ కంటే సమంత పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని త్రివిక్రమ్ చెప్పకనే చెప్పేశాడు. మరి సినిమాలో నితిన్ పాత్ర ఎలా ఉంటుందో ఏమో మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు