ఇక మనం సూపర్ స్టారే అనుకున్నా-తారకరత్న

ఇక మనం సూపర్ స్టారే అనుకున్నా-తారకరత్న

ఒక అరంగేట్ర కథానాయకుడు.. ఒకేసారి తొమ్మిది సినిమాలు మొదలుపెట్టడం అన్నది ప్రపంచ సినీ చరిత్రలోనే ఒకే ఒక్కసారి జరిగింది. ఆ రికార్డు నందమూరి తారకరత్న సొంతం. ఈ రికార్డుతో నందమూరి హీరో గిన్నిస్ బుక్‌లోకి సైతం ఎక్కాడు. కానీ విచారకర విషయం ఏంటంటే.. ఈ తొమ్మిది సినిమాల్లో సగం మాత్రమే రెగ్యులర్ షూటింగుకి వెళ్లాయి. విడుదలకు నోచుకున్నాయి. వాటిలో ఒక్కటి కూడా హిట్టవ్వలేదు. తారకరత్న ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా ఆడలేదు. ఇప్పటిదాకా అసలు హీరోగా ఏవరేజ్ సినిమా కూడా పడలేదు తారకరత్నకు. ఇప్పుడు విలన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న తారకరత్న.. ఓ ఇంటర్వ్యూలో తాను హీరోగా అరంగేట్రం చేసిన రోజుల్ని గుర్తు చేసుకున్నాడు.

‘‘తాతయ్య చిన్నపుడే నన్నోసారి అడిగాడు. నువ్వేం కావాలనుకుంటున్నావ్ నాన్నా అని.. ఆర్టిస్టు అవుతానని చెప్పా. ఐతే నా కష్టం వల్ల మీరందరూ సినిమాల్లోకి రావడం సులభమే కానీ.. ఆ తర్వాత సొంతంగా పేరు తెచ్చుకోవాలని చెప్పారు. బీటెక్ చేస్తుండగా నాన్నతో ఓసారి సినిమాల్లోకి రావాలనుకుంటున్నట్లు చెప్పాను. ముందు చదువు పూర్తి కానివ్వు అన్నారు. తర్వాత నా అరంగేట్రానికి ఏర్పాట్లు చేశారు. ఒకేసారి తొమ్మిది సినిమాలు మొదలవడంతో నా ఆనందానికి అవధుల్లేవు. తొలి రోజు ఒక్కో సినిమా ప్రారంభోత్సవం కోసం బట్టలు మార్చడానికే సమయం అంతా అయిపోయింది. ఐతే అలా ఒకేసారి అన్ని సినిమాలు మొదలయ్యేసరికి ఇక మనం సూపర్ స్టార్ అయిపోయినట్లే అనుకున్నా. కానీ ఆ తర్వాత నాకు వాస్తవం బోధపడింది. నా సినిమాలేవీ ఆడకపోవడంతో చాలా నిరాశ చెందాను. ఓ దశలో బాగా కుంగిపోయాను. ఐతే ఎలాంటి రిజల్ట్ వచ్చినా నా ప్రయత్నం ఆపలేదు. అందుకే ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉన్నాను’’ అని తారకరత్న చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు