చరణ్.. ఇక మొదలెట్టుకోవచ్చమ్మా

చరణ్.. ఇక మొదలెట్టుకోవచ్చమ్మా

రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ సినిమా విడుదలై ఆరు నెలలు దాటిపోయింది. కానీ ఇప్పటిదాకా అతడు తన తర్వాతి సినిమా షూటింగ్‌లో పాల్గొనలేదు. తన తర్వాతి సినిమాగా ఎంచుకున్నది రీమేకే అయినా.. అది మొదలవడానికి చాలా కాలమే పట్టింది. రీమేక్‌ను తెలుగు నేటివిటీకి తగ్గట్లు మారుద్దామని ట్రై చేసి.. మళ్లీ ఒరిజినల్‌కే కట్టుబడాలని నిర్ణయించుకుని.. చివరగా అనుకున్న దానికి డైలాగ్ వెర్షన్ రాయించేసరికి నాలుగైదు నెలలు గడిచిపోయాయి. చివరికి మార్చి నెలలో సినిమా మొదలైంది కానీ.. చరణ్ చెల్లెలి పెళ్లి కారణంగా షూటింగుకి బ్రేక్ పడింది. ఆ వ్యవహారం ముగిసేసరికి చిరంజీవి 150వ సినిమా స్క్రిప్టు పనులు తుది దశకు రావడంతో మళ్లీ తన సినిమా పని మొదలు పెట్టలేకపోయాడు చరణ్.

ఐతే ఎట్టకేలకు ‘కత్తి’ రీమేక్ స్క్రిప్టు ఫైనలైజ్ అయిపోయి.. ఈ సినిమా ముహూర్తం కార్యక్రమానికి కూడా డేట్ ఫిక్సయిపోవడంతో తన సినిమా మీద దృష్టిసారించే అవకాశం కలిగింది. ఈ నెల 29న చిరు రీఎంట్రీ మూవీకి ముహూర్తం అయిపోయాక ఓ వారం పాటు ఆ సినిమాకు సంబంధించిన షెడ్యూళ్ల గురించి వినాయక్‌తో చర్చించేసి.. మే 11 నుంచి తన సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాడు చరణ్. చిరు రీఎంట్రీ మూవీని చరణే స్వయంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా చరణ్ సినిమాకు సంబంధించి దర్శకుడు సురేంద్ర రెడ్డి చిన్నాచితకా సన్నివేశాలే తీశాడు. ఇప్పటిదాకా చరణ్ మీద చిత్రీకరణే జరగలేదని సమాచారం. ఐతే వచ్చే మూడు నెలల పాటు నిర్విరామంగా షూటింగ్ చేసి సినిమాను పూర్తి చేసి ఆగస్టులోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు