బయ్యర్లతో ఆడుకుంటున్నారుగా

బయ్యర్లతో ఆడుకుంటున్నారుగా

పూరి జగన్నాథ్‌ తమపై తప్పుడు కేసులు పెట్టాడంటూ బయ్యర్లు ప్రెస్‌ని కలిసి తమ కష్టాలన్నీ వెళ్లబోసుకున్నారు. ఒక సినిమాలో పోయిన దానిని వెతుక్కుంటూ మరో సినిమాపై పెట్టుబడి పెడుతూ జూదగాళ్లం అయిపోయామని, నష్టాలొచ్చినప్పుడు నిర్మాతల్ని, హీరోలని ఆదుకోమని వేడుకునే బిక్షగాళ్లం అయిపోయామని వారు చెప్పుకుంటూ వుంటే కోట్లతో వ్యాపారం చేసే బికారులనిపించారు. కాంపిటీటివ్‌ బిజినెస్‌ కావడంతో స్టార్‌ ఎట్రాక్షన్‌, కాంబినేషన్‌ క్రేజ్‌ వున్న సినిమాల వెంట పరుగులు తీస్తున్నారు. వారి ఆశని క్యాష్‌ చేసుకుంటూ లాభాలొస్తే ఇరవై శాతం కమీషన్‌ ఇచ్చే పద్ధతిలోనే నిర్మాతలు రైట్స్‌ ఇస్తున్నారు.

నష్టపోతే కూడా ఇరవై శాతం నష్టమే భరిస్తామని పాపం వారు న్యాయంగానే మాట్లాడుతున్నారు. కానీ హీరోనో, దర్శకుడో, నిర్మాతో దయతలిస్తే తప్ప పోగొట్టుకున్న దాంట్లో కొంత అయినా భర్తీ కాదట. అసలు వీళ్లంతా సినిమాలు కొనమంటూ మొండికేసేస్తే సినిమాకొచ్చి పదేసి కోట్లు తీసుకునే దర్శకులకి డబ్బులిచ్చేదెవరు? ఒక బయ్యర్‌ చాలా సూటిగా అడిగాడు... మిమ్మల్ని నమ్మి అన్నేసి కోట్లు ఇస్తున్నప్పుడు కనీస బాధ్యతతో కూడిన సినిమా తీయలేవా అని? చాలా పర్‌ఫెక్ట్‌ ప్రశ్న. సినిమా ఫెయిల్‌ అయినప్పుడు ఇంతకుమించి ఏమీ ఇవ్వమంటూ దర్శకులతో, హీరోలతో ఒప్పందాలు చేసుకుంటే ఒళ్లు దగ్గరెట్టుకుని సినిమాలు తీస్తారు. అడిగేవాడు లేనంత కాలం ఆడింది ఆట, పాడింది పాట, తీసిందే సినిమా అన్నట్టు రెచ్చిపోతూనే వుంటారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు