‘ఊపిరి’లో ఈ సీన్లు కూడా ఉండుంటే..

 ‘ఊపిరి’లో ఈ సీన్లు కూడా ఉండుంటే..సినిమా తీస్తున్నపుడు ప్రతి సన్నివేశం ముఖ్యమైందిగానే అనిపిస్తుంది. అలాగని ప్రతి సన్నివేశం గురించీ మొహమాట పడితే.. అంతే సంగతులు. ఎడిటింగ్‌లో ఎంత కొంత కట్ చేయకపోతే.. ప్రేక్షకులు సినిమా మొత్తాన్ని కట్ చేసేస్తారు. అందుకే నిడివి ఎక్కువ అనిపించినపుడు దర్శక నిర్మాతలు మొహమాటానికి పోకుండా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కొన్ని సన్నివేశాలకు కత్తెర వేసేస్తుంటారు. ఐతే ఫ్లాప్ అయిన సినిమాల విషయంలో ఈ సన్నివేశాల గురించి ఎవ్వరూ పట్టించుకోరు కానీ.. ఓ సినిమా హిట్టయితే అలాంటి సన్నివేశాల మీద జనాలకు కూడా బాగానే ఆసక్తి ఉంటుంది. ఆ మధ్య ‘నేను శైలజ’కు సంబంధించి కొన్ని డెలీటెడ్ సీన్స్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తే జనాలు ఆసక్తిగా చూశారు.

ఇప్పుడు లేటెస్ట్ హిట్ ‘ఊపిరి’ నుంచి కోత వేసిన కొన్ని సన్నివేశాల్ని కూడా నెట్లో పెట్టారు. మొత్తం మూడు డెలీటెడ్ సీన్స్ రిలీజ్ చేయగా.. అందులో ఒకదాని నిడివి దాదాపు ఐదు నిమిషాలుంది. నాగార్జునకు కార్తి స్నానం చేయించి తీసుకొచ్చి పడుకోబెట్టాక.. నీ లైఫ్ సూపరన్నయ్యా అంటాడు. ఐతే నాలాగా ఓ రెండు గంటలు ఉండి చూడు.. నీకే తెలుస్తుంది అంటాడు నాగ్. దాందేముంది అంటూ కుర్చీలో కూర్చుంటాడు కార్తి. తమన్నా అతడి చేతులు కాళ్లు కట్టేస్తుంది. ముందు తమన్నాతో సేవలు చేయించుకుంటే బానే ఉంటుంది కానీ.. తర్వాత ఓ పురుగు వచ్చి ముఖం మీద వాలితే దాన్నుంచి తప్పించుకోవడానికి నానా పాట్లు పడతాడు కార్తి. డబ్బులున్నంత మాత్రాన సరిపోదని అప్పటికి అర్థమవుతుంది కార్తికి. నాగార్జునకు స్నానం చేయించే మరో సీన్.. కార్తి-ప్రకాష్ రాజ్-తమన్నా కాంబినేషన్లో ఇంకో చిన్న సీన్ కూడా ఉన్నాయి. ఈ మూడు కూడా పర్వాలేదు అనిపించే సన్నివేశాలే. సినిమాలో ఉన్నా బాగానే అనిపించేవే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు