హీరోలను ముంచేస్తున్న నిర్మాతలు..!

హీరోలను ముంచేస్తున్న నిర్మాతలు..!

అదేంటి.. నిర్మాతల్ని హీరోలు కదా ముంచేయాలి. వాళ్ళ హంగులు ఆర్భాటాలు, రెమ్యునరేషన్లతో ఎప్పుడూ హీరోల చేతిలో నిర్మాతలే బలైపోతారు. కానీ ఇక్కడ మాత్రం సీన్ మరోలా ఉంది. నిర్మాతలే హీరోలను చెడగొడుతున్నారు. ఇమేజ్ తో పనిలేకుండా బడ్జెట్ పెట్టేసి హీరోల కెరీర్ లతో ఆటాడుకుంటున్నారు. ఓవర్ బడ్జెట్ అనేది ఇప్పుడు ఇటు హీరోలకు.. అటు నిర్మాతలకు శాపంగా మారుతుంది. ఇప్పుడు గోపీచంద్ నే తీసుకోండి. ఈయన మీడియం రేంజ్ హీరో. మనోడి సినిమాలకు 10 కోట్ల వరకు ఓకే. ఎందుకంటే గోపీ సినిమా హిట్టైతే 15 కోట్లు వస్తాయి కాబట్టి 10 కోట్ల బడ్జెట్ సేఫ్. కానీ నిర్మాతలకు ఇది పట్టడం లేదు. గోపీచంద్ సినిమాలపై ఏకంగా 20-30 కోట్లు పెడుతున్నారు.

జిల్ సినిమాను చాలా లావిష్ గా హై బడ్జెట్ తో నిర్మించింది యువీ సంస్థ. గోపీచంద్ మార్కెట్ తో పనిలేకుండా భారీ బడ్జెట్ పెట్టేసారు. ఈ సినిమా నిర్మాణ సంస్థకు విడుదలకు ముందే లాభాలు తీసుకొచ్చింది గానీ బయ్యర్లను మాత్రం ముంచేసింది. అంతకు ముందు సాహసం సినిమాకు కూడా ఇదే జరిగింది. ఇక ఇప్పుడు ఆక్సిజన్ సినిమాకు కూడా ఏకంగా 30 కోట్ల బడ్జెట్ పెడుతున్నారట నిర్మాతలు. జ్యోతికృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మిస్తున్నాడు. ఇది గోపీచంద్ మార్కెట్ కు చాలా ఎక్కువని తెలిసినా.. నిర్మాతలు ధైర్యం చేస్తున్నారు.

బాలయ్య వందో సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఇప్పటి వరకు లెజెండ్ మినహా 40 కోట్ల వసూళ్లు సాధించిన బాలయ్య సినిమా మరోటి లేదు. అలాంటిది ఇప్పుడు వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి కోసం ఏకంగా 50 కోట్లకు పైగా బడ్జెట్ పోస్తున్నారు నిర్మాతలు. మొన్నటికి మొన్న డిక్టేటర్ పై 30 కోట్ల బడ్జెట్ పెడితే అంతా తిరిగిరాలేదు. క్రిష్ విషయంలోనూ కంచెకు భారీ బడ్జెట్ పెట్టి కొన్ని నష్టాల్నే భరించాడు. ఇప్పుడు మళ్లీ బాలయ్య వందో సినిమాపై ఓవర్ బడ్జెట్ పెడుతున్నారు. నాన్నకు ప్రేమతో, ఊపిరి, సావిత్రి లాంటి చిత్రాల విషయంలోనూ...ఓవర్ బడ్జెట్లు కొంపముంచాయి. మొత్తానికి హీరోల ఇమేజ్ తో పనిలేకుండా అనవసరపు హంగులకు పోయి లేనిపోని ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు దర్శకనిర్మాతలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు