గోపీని నమ్మి 30 కోట్లు పెడుతున్నారా?

గోపీని నమ్మి 30 కోట్లు పెడుతున్నారా?

ప్రతి హీరోకూ ఒక మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్‌కు కాస్త అటు ఇటుగానే సినిమాలు చేసుకోవాలి. దాన్ని దాటి ఖర్చు పెడితే ఫలితాలు ఎలా ఉంటాయో చాలాసార్లు చూశాం. యాక్షన్ హీరో గోపీచంద్ విషయంలో ఇప్పటికే కొందరు నిర్మాతలు బడ్జెట్‌ను హద్దులు దాటించేయడం వల్ల బోల్తా కొట్టారు. సాహసం, జిల్.. రెండూ మంచి సినిమాలే. మంచి టాక్ కూడా వచ్చింది. కానీ ఆ రెండు సినిమాల బడ్జెట్ ఎక్కువైపోవడం వల్ల ఆ సినిమాలు చివరికి ఫ్లాపులుగా నిలిచిపోయాయి. ఐతే ఈ అనుభవాలు తెలిసి కూడా గోపీచంద్ కొత్త సినిమా ‘ఆక్సిజన్’కు రూ.30 కోట్ల బడ్జెట్ పెడుతున్నాడట సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం.

ఐతే రత్నం ఇంత సాహసం చేస్తోంది గోపీ మీద నమ్మకంతో కాదు. కొడుకు జ్యోతికృష్ణ మీద ప్రేమతో. ఈ చిత్రానికి జ్యోతికృష్ణే దర్శకుడు. ఇంతకుముందు కొడుకును దర్శకుడిగా పరిచయం చేస్తూ రత్నం తీసిన ‘నీ మనసు నాకు తెలుసు’ పెద్ద ఫ్లాపైంది. ఆ సినిమాతో చాలా నష్టపోయాడు రత్నం. ఆయన కొన్నేళ్ల పాటు సినిమాలు మానేయడానికి ఇది కూడా ఒక కారణం. ఐతే ఈ మధ్య తమిళంలో అజిత్‌తో ఆరంభం, ఎన్నై అరిందాల్, వేదాలం లాంటి హిట్లు తీసి మళ్లీ నిర్మాతగా నిలదొక్కుకున్న రత్నం.. సుదీర్ఘ విరామం తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. గోపీ-జ్యోతికృష్ణ కాంబినేషన్లో ‘ఆక్సిజన్’ చేస్తున్నాడు. ఐతే హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రూ.30 కోట్లు ఖర్చు పెడుతున్నాడట రత్నం. గోపీ మార్కెట్ ప్రకారం చూస్తే ఇది చాలా పెద్ద ఫిగరే. గోపీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టయితే తప్ప ఈ బడ్జెట్ వర్కవుటవ్వదు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు