‘మనం’ రికార్డును తుడిచేస్తోంది

‘మనం’ రికార్డును తుడిచేస్తోంది

అక్కినేని నాగార్జున సుడి మామూలుగా లేదిప్పుడు. సంక్రాంతికి సోగ్గాడిగా హుషారైన పాత్రతో ఎలా రికార్డుల మోత మోగించాడో.. ఇప్పుడు చక్రాల కుర్చీకి పరిమితమైన క్యారెక్టర్‌తో సైతం కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. నాగ్ లేటెస్ట్ మూవీ ‘ఊపిరి’ రెండో వారంలో కూడా అద్భుతమైన కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ముఖ్యంగా అమెరికాలో ‘ఊపిరి’ ఊపు మామూలుగా లేదు. తొలి వారంలోనే మిలియన్ క్లబ్బులోకి అడుగుపెట్టేసిన ఈ సినిమా.. రెండో వారం కూడా అదే జోరు చూపించింది. యుఎస్‌లో నాగార్జునకు ‘ఊపిరి’ మూవీనే హైయెస్ట్ గ్రాసర్ కాబోతోంది. ఇప్పటిదాకా ఈ రికార్డు ‘మనం’ పేరిట ఉంది.

‘మనం’ 1.54 మిలియన్ డాలర్లతో నాగ్ చిత్రాల్లో నెంబర్ వన్ స్థానంలో ఉంది. ‘ఊపిరి’ ఆ రికార్డుకు అత్యంత చేరువలో ఉంది. తొమ్మిది రోజుల్లోనే ఆ చిత్రం 1.316 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. శనివారం 1.5 లక్షల డాలర్లు వసూలు చేయడం విశేషం. ఇంకా ఆదివారం కలెక్షన్ల లెక్క తేలాల్సి ఉంది. 1.5-2 లక్షల డాలర్ల మధ్య వసూళ్లు వచ్చి ఉండొచ్చని అంచనా. అంటే దాదాపుగా ఒకటిన్నర మిలియన్ డాలర్ల మార్కును ‘ఊపిరి’ అందుకున్న మాటే అన్నమాట. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రావడానికి ఇంకా ఐదు రోజులు ఉంది కాబట్టి ఈ లోపు ‘ఊపిరి’ ఈజీగా ‘మనం’ను దాటేయడం ఖాయం. పవన్ సినిమా లేకుంటే ‘ఊపిరి’ 2 మిలియన్ క్లబ్బును కూడా అందుకునే అవకాశాలుండేవి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు