సంపూ సెగలు మామూలుగా లేవు

 సంపూ సెగలు మామూలుగా లేవు

అప్పట్లో 'సింహాద్రి' సినిమా సంచలన విజయం సాధించిన టైంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ పేద్ద పత్రికా ప్రకటన విడుదల చేసి చివర్లో.. సదా మీ ప్రేమకు నే బానిసను అంటూ తన పేరు ముందు చేసిన వాక్య ప్రయోగం అందరినీ ఆకట్టుకుంది. కేవలం పేరడీలతోనే తన కెరీర్‌కు బాటలు వేసుకున్న సంపూర్ణేష్ బాబు.. ఈ మాటను హైజాక్ చేసేసి తెగ వాడేసుకుంటుండటం ఎప్పట్నుంచో చూస్తున్నాం. సంపూ మొదట్లో వేసిన కొన్ని పేరడీ వేషాలు నచ్చి అతడికి కొంచెం ఫాలోయింగ్ వచ్చిన మాటవాస్తవమే అనుకోండి. కానీ అతను మాత్రం మరీ స్టార్ హీరోల స్థాయిలో తనకు అభిమానులున్నట్లు తెగ ఫీలైపోతుంటాడు.

'హృదయ కాలేయం' తర్వాత చేసిన పేరడీ సినిమా 'సింగం 123' జనాల్ని ఎంతగా విసిగించిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అయినా సంపూ తన పేరడీ వేషాలు మానకుండా 'కొబ్బరి మట్ట' అనే కొత్త సినిమాతో రెడీ అవుతున్నాడు. అందులో అయినా కొత్తగా ఏదైనా ట్రై చేస్తాడేమో అని ఆశలేం పెట్టుకోవాల్సిన పని లేదని.. ఇది కూడా సేమ్ టు సేమ్ పేరడీలు, స్పూఫులతోనే సాగిపోతుందని ఇప్పటిదాకా చూపించిన ప్రోమోలతోనే అర్థమైంది. ఇందులో బాబుగారు పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయుడు అనే మూడు పాత్రల్లో నటిస్తున్నాడు. ఈ పాత్రల గురించి ఇప్పటికే చాలా బిల్డప్పులిచ్చాడు సంపూ. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఎడిటింగ్ జరుగుతుండగా.. మానిటర్ మీద పెదరాయుడు పాత్రలో సంపూ కనిపిస్తున్న దృశ్యాన్ని స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్లో షేర్ చేశాడు సంపూ. ''నా నటనకు నేనే పారవశ్యం చెందుతున్నాను ఎడిటింగ్‌లో చూసుకుని'' అంటూ ఈ ఫొటోకు వ్యాఖ్య జోడించాడు సంపూ. ఇది చూసి బర్నింగ్ స్టార్ సెగలు మరీ ఎక్కువైపోయాయే అనుకుంటున్నారు జనాలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు