మరో మర్కజ్.. చూడబోతున్నామా?

మార్చి నెలలో ఢిల్లీలో మర్కజ్ ప్రార్థనలనేవే జరగకపోయి ఉంటే దేశంలో కరోనా వైరస్ ఎప్పుడో కట్టడి అయ్యేదన్న అభిప్రాయం బలంగా ఉంది జనాల్లో. ఆ కార్యక్రమంలో పాల్గొని వచ్చిన వేల మంది కరోనా బారిన పడటం.. వారి నుంచి వేల మందికి వైరస్ సోకడం.. ఈ చైన్ కొనసాగి దేశంలో కరోనా కేసులు అనూహ్యంగా పెరిగిపోవడం తెలిసిన సంగతే. ఆ ప్రభావం నుంచి ఇంకా దేశం కోలుకోలేకపోతోంది.

ఐతే మిగతా దేశాలతో పోలిస్తే కరోనా వ్యాప్తి, మరణాల రేటులో మన దేశం ఎంతో నయం అనుకుంటున్నాం. లాక్ డౌన్‌ను మరీ పొడిగించుకుంటూ పోతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి.. ఆకలి చావులు తప్పవన్న ఆందోళనతో ఇంకో రెండు వారాల తర్వాత అయినా కచ్చితంగా సడలింపులు ఇవ్వాల్సిందే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రాలన్నీ ఆర్థిక సంక్షోభంల కూరుకుపోయిన నేపథ్యంలో సోమవారం నుంచి మద్యం దుకాణాల్ని పున:ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఐతే నెలన్నర షట్ డౌన్ తర్వాత వైన్ షాపులు తెరుచుకుంటుండటంతో మందుబాబులు ఈ రోజు మద్యం కోసం ఎగబడతారని తెలుసు. కానీ నిబంధనల ప్రకారం భౌతిక దూరాన్ని పాటిస్తూ మద్యం కొంటారని.. దుకాణాల ముందు పకడ్బందీ ఏర్పాట్లు ఉంటాయని ఆశించారు. కానీ చాలా చోట్ల ఆ పరిస్థితి లేదు.

మందు బాబులు కూడా అస్సలు ఆగలేం అన్నట్లుగా తండోపతండాలుగా వచ్చేశారు. దీంతో చాలా చోట్ల పరిస్థితులు అదుపు తప్పాయి. భౌతిక దూరం గురించి పట్టించుకునేవాళ్లే లేరు. వేలమందిని పోలీసులు ఎలా నియంత్రించగలరు. దీంతో చాలా చోట్ల తక్కువ దూరంలో వందలు, వేలమంది పోగయ్యారు. మాస్కుల్లేవు. సోషల్ డిస్టన్స్ లేదు. ఈ వేల మందిలో ఒకరిద్దరికి కరోనా ఉన్నా అంతే సంగతులు. వారి నుంచి మరెంతో మందికి వైరస్ సోకే ప్రమాదం ఉంది.

దేశవ్యాప్తంగా ఇలా మద్యం దుకాణాలు తెరిచిన ప్రాంతాలన్నింట్లో ఎందరు కరోనాతో ఉన్నారో.. వాళ్ల నుంచి ఇంకెంతమందికి వైరస్ సోకుతుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మర్కజ్ తర్వాత అలాంటి మరో ఉపద్రవాన్ని చూడబోతున్నామేమో అన్న ఆందోళన కలుగుతోంది మద్యం దుకాణాల ముందు దృశ్యాలు చూస్తుంటే.