700 కోట్లంట.. ఏం చేస్తారో ఏమో..?

700 కోట్లంట.. ఏం చేస్తారో ఏమో..?

700 కోట్ల జూదం.. వస్తే వస్తాయి.. లేదంటే లేదు. కానీ ఇంత మొత్తం అంటే మాత్రం దర్శకనిర్మాతలకు గుండె జారిపోతుంది. కేవలం ఒక్క నెల గ్యాప్ లోనే ఇన్ని వందల కోట్ల జూదం నడుస్తుంది. తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీల్లో ఒకేసారి భారీ సినిమాలు వస్తున్నాయి. ఎప్రిల్ లోనే ఈ 700 కోట్ల బిజినెస్ జరగనుంది. తెలుగులో సర్దార్, సరైనోడు సినిమాలు ఎప్రిల్ లో రానున్నాయి. సర్దార్ పై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 100 కోట్లు దాటిపోయిందని లెక్కలేస్తున్నారు.. ఇక సరైనోడు కూడా దాదాపు 70 కోట్ల మేర బిజినెస్ చేసేసింది.

తమిళనాట కూడా భారీ సినిమాలు ఎప్రిల్ లోనే సందడి చేస్తున్నాయి. విజయ్ హీరోగా నటించిన తెరీ ఎప్రిల్ 14న వస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 110 కోట్లు దాటిపోయిందట. అట్లీకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయ్ మూడు భిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెరీతో పాటు సూర్య 24 కూడా ఎప్రిల్ లోనే రానుంది. విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం కూడా తెలుగు, తమిళ భాషల్లో కలిపి 80 కోట్ల బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాలంటున్నాయి.

హిందీలోనూ ఓ భారీ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అదే ఫ్యాన్. షారుక్ ఖాన్ హీరోగా మనీష్ శర్మ తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దిల్ వాలే ఫ్లాప్ కావడంతో కింగ్ ఖాన్ ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 300 కోట్లకు పైగా జరిగింది. సమ్మర్ సినిమాల్లో సింహభాగం ఈ సినిమాదే. దీంతోపాటు కీ అండ్ కా, బాఘీ సినిమాలు కూడా 100 కోట్ల మేర బిజినెస్ చేసాయి. మొత్తానికి ఎప్రిల్ నెల ఒక్కటే దాదాపు 700 కోట్ల బిజినెస్ కు సాక్ష్యంగా నిలవనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు