పవన్‌ అక్కడ.. బాబీ ఇక్కడే..

పవన్‌ అక్కడ.. బాబీ ఇక్కడే..

తెలుగు సినిమాల్లో చాలా వరకు పాటలకు పెద్దగా కాన్సెప్టులంటూ ఏమీ ఉండవు. దర్శకులు పాటల చిత్రీకరణలో పెద్దగా క్రియేటివిటీ కూడా ఏమీ చూపించరు. డ్యాన్స్ డైరెక్టర్ల చేతికి బాధ్యతలిచ్చేసి నామ్ కే వాస్తే పాటలు చుట్టేస్తుంటారు. అయినప్పటికీ పాటలు తీసేటపుడు అక్కడ దర్శకుడు ఉండాల్సిందే. కానీ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా విషయంలో మాత్రం దర్శకుడు లేకుండానే రెండు పాటల చిత్రీకరణ జరిగిపోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ‘సర్దార్..’ ఆడియో వేడుక ముగిశాక పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్‌ల మీద రెండు పాటలు చిత్రీకరించడానికి యూనిట్ సభ్యులు యూరోప్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఐతే ఆ యూనిట్లో డైరెక్టర్ బాబీ లేడని సమాచారం.

ఇద్దరు ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్లను పెట్టుకుని.. పరిమితమైన స్టాఫ్‌తో కలిసి పవన్ యూరప్ వెళ్లాడట. డైరెక్టర్ బాబీ ఇక్కడే ఉండి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చూసుకుంటున్నాడట. ‘సర్దార్’కు సంబంధించి పవన్ అన్నీ తానై వ్యవహరిస్తున్నాడని.. డైరెక్టర్ పెద్దగా చేస్తోందేమీ లేదని ఇప్పటికే రకరకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇక్కడ లోకల్‌గా తీసిన పాటల్లో సైతం కాన్సెప్ట్స్ అన్నీ పవనే చూసుకున్నాడని.. బాబీ ప్రమేయం తక్కువే అని యూనిట్ సభ్యులంటున్నారు. మామూలుగానే తన సినిమాల పాటల చిత్రీకరణలో పవన్ ప్రమేయం చాలా ఉంటుంది. ‘సర్దార్’ అన్నది పవన్ బ్రెయిన్ చైల్డ్ కాబట్టి జోక్యం కాస్త ఎక్కువే అంటున్నారు జనాలు. ఐతే ఏప్రిల్ 8 నాటికి ఎట్టి పరిస్థతుల్లోనూ సినిమాను రిలీజ్ చేయాలన్న పట్టుదల కారణంగానే బాబీని ఇక్కడ పెట్టి.. పవన్ పాటలు తీసుకోవడానికి ఫారిన్ వెళ్లాడని.. ఇలాంటి ప్లానింగ్‌తో పని చేస్తే తప్ప సినిమా అనుకున్న సమయానికి రిలీజవ్వదని అనే వాళ్లూ లేకపోలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు