యంగ్ హీరో బాగోతమంతా బయటపడింది

యంగ్ హీరో బాగోతమంతా బయటపడింది

నండూరి ఉదయ్ కిరణ్.. ఈ పేరు తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. కానీ జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ పోలీసులు మాత్రం ఇతణ్ని ఓ స్టార్ హీరోను గుర్తుపట్టినట్లు గుర్తుపడతారు. అయ్యవారు అక్కడ అంత ఫేమస్ మరి. తరచుగా ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం.. పోలీస్ స్టేషన్ గడప తొక్కడం ఈ బాబుకి అలవాటైన వ్యవహారం. లేటెస్టుగా దస్ పల్లా హోటల్ దగ్గర ఉదయ్ కిరణ్ చేసిన రభస అంతా సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా బయటపడింది. ఓ పక్క ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. గొడవ జరిగిన రోజు రాత్రి అసలు తాను హైదరాబాద్‌లోనే లేని.. ముంబయి నుంచి పొద్దునే  వచ్చానని... ఇంకా ఏదేదో కబుర్లు చెప్పాడు. కానీ సీసీటీవీలో బాబుగారి బాగోతమంతా క్లియర్‌గా తెలుస్తూనే ఉంది. కన్నూ మిన్నూ తెలియకుండా మందుకొట్టి.. అతను చేసిన యాగీ అంతా ఇంతా కాదు.

ఉదయ్ కిరణ్ ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా దారుణంగానే ఉంది. ఇటీవల జూబ్లీహిల్స్‌లోని ఎయిర్‌ పబ్ దగ్గర తాగిన మత్తులో పిస్టల్‌తో ఓ స్నేహితుడిపైనే దాడికి దిగాడు. మాదాపూర్‌లో నిర్భయ చట్టం కింద అరెస్టు అయ్యాడు. కాకినాడలో సినిమాల్లో వేషాలు ఇప్పిస్తానని ఓ మహిళను నమ్మించి ఆమె కూతురితో స్నేహం చేసి అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో అరెస్టు అయ్యాడు. కాకినాడలోని జీఆర్పీ బార్‌లో కూడా గొడవ చేసిన ఘటనలో జైలుకు వెళ్లాడు. సినిమాల్లో వేషాలు ఇప్పిస్తానని, ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటనలోను క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని తేలింది. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి స్నేహితులు, బంధువుల ఖరీదైన కార్లను అరువు తీసుకునే వాడని.. తిరిగి ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెట్టేవాడని కూడా తెలిసింది. గతంలో ఓ డ్రగ్స్ కేసులోనూ  పట్టుబడి జైలు జీవితం అనుభవించాడు. మోసాలకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తూ జల్సాలకు పాల్పడుతున్నట్లు కూడా పోలీసుల విచారణలో తేలింది. ఇలాంటి బ్యాగ్రౌండ్ ఉన్నవాడు.. దస్ పల్లా హోటల్ దగ్గర అలా ప్రవర్తించడంలో ఆశ్చర్యమేముంది చెప్పండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు