జనసేనకు అర్జెంటుగా కావల్సిందేంటి?

ప్ర‌శ్నిస్తామంటూ.. పార్టీ పెట్టిన ప‌వ‌న్‌కు అనేక ప్ర‌శ్న‌లు చుట్టుముట్టాయి. రాజ‌కీయ వేదిక‌పై అన్న చాటు త‌మ్ముడిగా అరంగేట్రం చేసిన ప‌వ‌న్‌.. ప్ర‌జారాజ్యం విభాగం యువ‌రాజ్యం చీఫ్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత కాలంలో పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయ‌డంతో వేచి చూసి 2014 ఎన్నిక‌ల‌కు ముందు పార్టీ పెట్టినా.. ఆ ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉన్నారు.

అదే స‌మ‌యంలో జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా చంద్ర‌బాబు కూట‌మికి మద్ద‌తు ప‌లికారు. ప్ర‌చారం చేశారు. ఇంత వ‌ర‌కు బాగానే త‌ర్వాత గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో పోటీకి దిగిన పార్టీ ఒకే ఒక్క స్థానంలో విజ‌యం సాధించింది. త‌ర్వాత పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపించే నాయ‌కులు ఒక‌రిద్ద‌రు త‌ప్ప ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు.

పోనీ.. ఇత‌ర పార్టీల మాదిరిగా.. అంటే.. గ‌త ప్ర‌భుత్వాన్ని న‌డిపిన టీడీపీ త‌ర‌హాలో ఎవ‌రైనా నోరు విప్పితే.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం కేసులు న‌మోదు చేస్తుందా? అనే భ‌యం ఎక్క‌డా లేదు. ఎందుకంటే.. బ‌ల‌మైన వాయిస్. అనుకూల మీడియా అండ‌దండ‌లు ఉన్న ప‌వ‌న్ ఎలాగూ ఉన్నారు కనుక జ‌న‌సేన‌లో నేత‌ల‌కు ఎలాంటి విమ‌ర్శ‌లు చేసేందుకైనా.. ఇబ్బంది లేదు. కానీ, ఏ ఒక్క‌రూ ముందుకు రావ‌డం లేదు. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించ‌డం అలా ఉంచితే.. జ‌న‌సేన‌ను ముందుకు తీసుకు వెళ్లేందుకు. పార్టీని బ‌లోపేతం చేసుందుకు ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. వాయిస్ వినిపించ‌డం లేదు. త‌న పార్టీలో భిన్న‌మైన క‌మిటీల‌ను ప‌వ‌న్ ఏర్పాటు చేశారు.

వీర మ‌హిళ పేరుతో పెద్ద ఎత్తున మ‌హిళా క‌మిటీలను ఏర్పాటు చేశారు. అయితే.. ఇప్పుడు వీరు ఎక్క‌డ ఉన్నారో.. ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదు. రాష్ట్రంలో ఉన్న అనేక స‌మ‌స్య‌ల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని పార్టీలో గుర్తింపు పొందేందుకు, ప్ర‌జ‌ల్లో మంచి మార్కులు వేయించుకునేందుకు అవ‌కాశం ఉన్నాకూడా.. ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు.

ఇక‌, యువ‌త‌కు కూడా పెద్ద ఎత్తున అనేక క‌మిటీల్లో ప‌వ‌న్ స్థానం క‌ల్పించారు. వారు కూడా ఎక్క‌డా గ‌డ‌ప దాట‌డం లేదు. అస‌లు పార్టీలో ఉన్నారో లేరో కూడా తెలియ‌దు. ఇవన్నీ ఒక ఎత్త‌యితే.. 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు నాయ‌కులు క‌రువ‌య్యారు.

దీంతో కేవ‌లం 140 స్థానాల‌కే జ‌న‌సేన ప‌రిమిత‌మైంది. పోనీ పోటీ చేసి.. ఓడినా.. గెలిచినా.. పార్టీ వెంటే ఉన్నామ‌న్న వారు కూడా వేళ్ల‌మీద లెక్కించుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. కీల‌క‌మైన నాయ‌కులు పార్టీ నుంచి జారిపోయారు. ప్ర‌జాబ‌లం ఉన్న వారు పార్టీలోకి వ‌చ్చే పరిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌డంలేదు. నిజానికి ఇప్పుడున్న ప‌రిస్థితిలో వైసీపీలో అంత‌ర్గ‌త క‌ల‌హాల కార‌ణంగా.. పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు చాలా మంది నాయ‌కులు సిద్ధంగా ఉన్నారు. కానీ, ప్ర‌త్యామ్నాయ పార్టీ వారికి క‌నిపించ‌డం లేదు. దీంతో మౌనంగా ఉండిపోతున్నారు. మ‌రి ఈ గ్యాప్‌ను ఫిల్ చేసేందుకు, పార్టీని పున‌రుత్తేజ ప‌రిచేందుకు ప‌వ‌న్ కొంత శ్ర‌ద్ధ తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.