ఇక్కడ సునీల్.. అక్కడ అతను

ఇక్కడ సునీల్.. అక్కడ అతను

కమెడియన్‌గా సునీల్ కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లు సాగుతుండేది. ఐతే ‘అందాల రాముడు’తో అనుకోకుండా హీరో అయిపోయిన ఈ భీమవరం బుల్లోడికి ఆ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ పిలిచి మరీ ‘మర్యాద రామన్న’లో ఛాన్సిచ్చాడు. ఐతే ఈ రెండు సినిమాల్లో సునీల్ చేసింది కామెడీ రోలే. పూర్తి స్థాయి హీరో పాత్ర కాదు. కనీసం హీరోగా ఈ టైపు పాత్రలతోనే సాగిపోతూ.. మరోవైపు కమెడియన్‌గా కొనసాగినా బాగుండేది.

కానీ సునీల్ మాత్రం ‘పూలరంగడు’ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో తనను తాను పెద్ద మాస్ హీరోగా ఊహించేసుకున్నాడు. తర్వాత వరుసగా రెగ్యులర్ మాస్ హీరోల తరహాలోనే సినిమాలు చేసుకుంటూ పోయాడు. ఇప్పుడు అతడి పరిస్థితి ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లేటెస్ట్ డిజాస్టర్ ‘కృష్ణాష్టమి’ సునీల్ భవిష్యత్తునే అగమ్యగోచరంగా మార్చేసింది. హీరోగా కొనసాగనూ లేడు. తిరిగి కమెడియనూ కాలేడు. ఇలాంటి అయోమయంలో పడి కొట్టుకుంటున్నాడు.

సరిగ్గా తమిళంలో సంతానం పరిస్థితి కూడా ఇంతే. అతను కమెడియన్‌గా సునీల్ కంటే గొప్ప స్థితినే అనుభవించాడు కోలీవుడ్లో. దాదాపు దశాబ్దం పాటు అతడు తమిళ సినిమాను ఏలాడు. కానీ అతడికి కూడా సునీల్ తరహాలోనే హీరో వేషాలపై మోజు పుట్టింది. మొదట కమెడియన్‌గా చేస్తూనే.. హీరో కాని హీరో తరహా పాత్రలు చేశాడు. సునీల్ ‘మర్యాదరామన్న’ను కూడా రీమేక్ చేశాడు. అది పెద్దగా ఆడలేదు.

‘ఇనుమే ఇప్పిడిదా’ పేరుతో ఈ మధ్య సంతానం హీరోగా తెరకెక్కిన సినిమా ఫ్లాప్ అయింది. అయినా సంతానం హీరో వేషాలకు స్వస్తి చెప్పట్లేదు. మూణ్నాలుగు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. కమెడియన్ వేషాలు బాగా తగ్గించేశాడు. సంతానం ఇచ్చిన గ్యాప్‌లో పరోటా సూరి, సతీష్, కరుణాకరన్ లాంటి కమెడియన్లు టాప్ రేంజికి వచ్చేశారు. చూస్తుంటే మున్ముందు సంతానం పరిస్థితి కూడా సునీల్ లాగే తయారయ్యేలా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు