సుడి గుండంలో చిక్కుకున్న నితిన్..

సుడి గుండంలో చిక్కుకున్న నితిన్..

కష్టాల గురించి మాట్లాడే అర్హత ఎవ్వరికీ లేదు నాకు తప్ప అంటూ జల్సాలో పవన్ ఓ డైలాగ్ చెబుతాడు. అచ్చం ఇలాగే ఫ్లాపుల గురించి మాట్లాడే అర్హత మీకు ఎవ్వరికీ లేదు నాకు తప్ప అంటున్నాడు నితిన్. ఒకటా రెండా ఏకంగా ఎనిమిదేళ్ల పాటు హిట్ అనే మాటే లేకుండా కెరీర్ లాగించాడు నితిన్. ఇక ఈ హీరోను మరిచిపోదాం అనుకునే సమయంలో ఇష్క్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు నితిన్. ఈ సినిమా ఆయన కెరీర్ కు ఊపిరి. అంతకంటే ఎక్కువే. ఆ వెంటనే గుండెజారి గల్లంతయిందేతో మరో హిట్.

వరస విజయాలతో దూసుకుపోతున్న నితిన్ కెరీర్ కు హార్ట్ ఎటాక్ నుంచి మళ్లీ బ్రేకులు పడుతూనే ఉన్నాయి. ఆ సినిమా ఏదో యావరేజ్ గా నిలిచింది. ఇక చిన్నదాన నీ కోసం ఫ్లాప్.. కొరియర్ బాయ్ కళ్యాణ్ అడ్రస్ గల్లంతు.. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ నితిన్ కెరీర్ గ్రాఫ్ పెద్దగా ఏం లేదు. ఇష్క్, గుండెజారి మాత్రమే హిట్లు. దాంతో ఇప్పుడు ఈ కుర్ర హీరో ఆశలన్నీ అ..ఆ సినిమాపైనే ఉన్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకుడు కావడంతో ఎలాగైనా అ..ఆ తో తనకు స్టార్ ఇమేజ్ వస్తుందని నమ్ముతున్నాడు నితిన్.

పన్నెండేళ్ల కెరీర్ లో ఎంతోమంది అగ్ర దర్శకులతో పనిచేసినా.. నితిన్ మార్కెట్ ఎందుకో 25 కోట్ల లోపే ఆగిపోయింది. ఇప్పుడు ఆ లోటు తీర్చుకోవాలని చూస్తున్నాడు నితిన్. అ..ఆతో తన మార్కెట్ స్థాయి మరో 10 కోట్లు పెరుగుతుందని ఆశిస్తున్నాడు ఈ కుర్రహీరో. సమంత, అనుపమ పరమేశ్వరన్ ఇందులో నితిన్ కు జోడీగా నటిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ లుక్ కూడా బయటికి వచ్చింది. మొత్తానికి సుడిగుండాల మధ్య నడుస్తున్న నితిన్ కెరీర్ కు అ..ఆ.. చుక్కానిగా మారుతుందో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు