లారెన్స్ ఇచ్చాడుగా ట్విస్టు

లారెన్స్ ఇచ్చాడుగా ట్విస్టు

గత ఏడాది తెలుగులో సర్ ప్రైజ్ బ్లాక్ బస్టర్ హిట్ అంటే 'పటాస్' మూవీనే. వరుస ఫ్లాపుల్లో ఉన్న కళ్యాణ్ రామ్ హీరో.. దర్శకుడు అనిల్ రావిపూడి కొత్తవాడు.. దీంతో సినిమాపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. కానీ ఆ సినిమా ఊహించని విధంగా చాలా పెద్ద సక్సెస్ అయింది. సినిమా రిలీజైన వారానికి అటు కన్నడలో, ఇటు తమిళంలో రీమేక్ రైట్స్ అమ్ముడైపోయాయి. కన్నడలో గోల్డెన్ స్టార్ గణేష్ హీరోగా ఈ సినిమాను రీమేక్ చేయగా.. తమిళంలో రాఘవ లారెన్స్ హీరోగా కాస్త లేటుగా ఈ రీమేక్ మొదలైంది. మన రామోజీ ఫిలిం సిటీలోనే ఈ సినిమా మెజారిటీ పార్ట్ షూటింగ్ చేశారు. సాయి రమణి అనే దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ 'సూపర్ గుడ్ ఫిలిమ్స్' ప్రొడ్యూస్ చేస్తోంది.

'మొట్ట శివ కెట్ట శివ' పేరుతో రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసేశారు. లారెన్స్ ఇందులో రెండు లుక్స్ లో కనిపించి షాకిచ్చాడు. ఒకదాంట్లో క్లాస్ గా, ఇంకోదాంట్లో ఊర మాస్ గా కనిపిస్తున్నాడు లారెన్స్. ఐతే తెలుగులో హీరో పాత్రకు రెండు షేడ్స్ ఏమీ ఉండవు. సినిమా అంతా కళ్యాణ్ రామ్ లుక్ ఒకేరకంగా ఉంటుంది. మరి తమిళంలో లారెన్స్ స్టయిల్లో ఏవైనా మార్పులు చేశారేమో తెలియదు. ఈ చిత్రంలో 'కృష్ణాష్టమి' ఫేమ్ నిక్కీ గర్లాని కథానాయికగా నటిస్తోంది. తెలుగులో సాయికుమార్ పోషించిన హీరో తండ్రి పాత్రను సత్యరాజ్ చేస్తుండటం విశేషం. ఈ వేసవిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి తెలుగులో లాగే అక్కడ కూడా సినిమా పెద్ద హిట్టవుతుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు