మారుతి చెప్పిన 'సర్దార్' అప్‌డేట్స్

మారుతి చెప్పిన 'సర్దార్' అప్‌డేట్స్

పవన్ కళ్యాణ్ గురించి ఎవరు ఏం మాట్లాడినా అది వార్తే. అందులోనూ ఆయన సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఇచ్చారంటే అందరూ ఆసక్తిగా వింటారు. అందుకే యంగ్ డైరెక్టర్ దాసరి మారుతి అమలాపురంలోని ఓ కళాశాలలో పవన్ ప్రస్తావన తెచ్చి విద్యార్థుల్లో జోష్ నింపాడు. ఈ కళాశాలలో జరిగిన వేడుకల కోసం మారుతిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఐతే కళాశాలలో అక్కడక్కడా పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు, జనసేన పార్టీ జెండాలు కనిపిండచంతో మారుతి తన స్పీచ్ అంతా పవన్ చుట్టూనే తిప్పాడు.

''ఇక్కడికొచ్చి విద్యార్థులకు పవన్ కళ్యాణ్ మీద ఎంత అభిమానముందో చూశాక.. వెంటనే వెళ్లి పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయనతో సినిమా చేసే అవకాశం అడగాలనిపిస్తోంది. ఈ మధ్యే సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లాను. యూనిట్ సభ్యులు అనుకున్న ప్రకారం సినిమాను పూర్తి చేయడానికి చాలా కష్టపడుతున్నారు. ఓ పక్క పాటలు తీస్తున్నారు. మరోపక్క ఫైట్లు షూట్ చేస్తున్నారు. రెండు పనులూ ఒకేసారి జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ చాలా మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మిగతా హీరోలకు అభిమానులు మాత్రమే ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్‌కు మాత్రం భక్తులుంటారు. అభిమానులకు పవన్ దేవుడిలాంటోడు'' అంటూ తన అభిమాన కథానాయకుడిని ఆకాశానికెత్తేశాడు మారుతి. పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయడమే తన జీవితాశయమని మారుతి గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు