సోగ్గాడు ఇప్పటికీ రేసులోనే ఉన్నాడు

సోగ్గాడు ఇప్పటికీ రేసులోనే ఉన్నాడు

సంక్రాంతి సినిమాలు రిలీజై యాభై రోజులు దాటిపోయాయి. పండక్కి విడుదలైన డిక్టేటర్, ఎక్స్ ప్రెస్ రాజా, నాన్నకు ప్రేమతో సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఎక్కడా ఆడట్లేదు. కానీ వాటితో పాటుగా రిలీజైన 'సోగ్గాడే చిన్నినాయనా' మాత్రం ఇప్పటికీ చెప్పుకోదగ్గ సంఖ్యలోనే థియేటర్లలో నడుస్తోంది. 110 సెంటర్లలో అర్ధశత దినోత్సవం జరుపుకున్న ఈ సినిమా.. అందులో మెజారిటీ థియేటర్లలో కంటిన్యూ అవుతోంది. సంక్రాంతి తర్వాత రెండో వారం నుంచి సినిమాలు వస్తున్నాయి, పోతున్నాయి.. కానీ 'సోగ్గాడే..' మాత్రం అలాగే నిలబెడి ఉంది. కృష్ణగాడి వీర ప్రేమ గాథ, క్షణం, కళ్యాణ వైభోగమే లాంటి మంచి సినిమాలు కూడా 'సోగ్గాడే..'ను థియేటర్ల నుంచి తప్పించలేకపోయాయి.

నాని సినిమా రిలీజైన తొలి వారం నాగ్ మూవీ మీద పైచేయి సాధించింది కానీ.. ఆ తర్వాత దానికి, దీనికి పెద్దగా తేడా ఏమీ ఉండట్లేదు. 'క్షణం' పరిస్థితి కూడా అంతే. లేటెస్ట్ హిట్ 'కళ్యాణ వైభోగమే' సైతం ఇలాగే నడుస్తోంది. మొన్న ఆదివారం హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న ప్రముఖ థియేటర్లలో కలెక్షన్ల లెక్కలు చూస్తే సోగ్గాడి ప్రభంజనం ఇప్పటికీ ఎలా సాగుతోందో అర్థమవుతుంది. పీఆర్వో వెల్లడించిన లెక్కల ప్రకారం.. క్రాస్ రోడ్స్ లోని సంధ్య 35 ఎంఎం థియేటర్లో సెకండ్ షోకు 'సోగ్గాడే చిన్నినాయనా' 47,740 రూపాయలు కలెక్ట్ చేయడం విశేషం. అదే షోకు సుదర్శన్ థియేటర్లో కళ్యాణ వైభోగమే రూ.73 వేల దాకా వసూలు చేసింది. శౌర్య మూవీ రూ.49 వేలు, కృష్ణగాడి వీర ప్రేమ గాథ రూ.37 వేలు, గుంటూరు టాకీస్ రూ.35 వేలు వసూలు చేశాయి. ఈ లెక్కల్ని బట్టే 'సోగ్గాడే చిన్నినాయనా' ఎందుకు ఇంకా థియేటర్లలో కంటిన్యూ అవుతోందో అర్థమైపోతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు