ఎన్ని రీమేకులు దించుతావ్ వెంకీ?

ఎన్ని రీమేకులు దించుతావ్ వెంకీ?

విక్టరీ వెంకటేష్ సినిమాల లిస్టు తీస్తే అందులో ఓ 25 శాతమైనా రీమేక్ సినిమాలే ఉంటాయేమో. ఒకానొక టైంలో వెంకటేష్ నటించే ప్రతి మూడు సినిమాల్లో ఒక్కటైనా రీమేక్ ఉండేది. ఐతే మధ్యలో రీమేక్‌ల జోలికి వెళ్లకుండా వరుసగా స్ట్రెయిట్ సినిమాలే చేశాడు వెంకీ. ఐతే ఈ మధ్య వెంకీకి మళ్లీ రీమే‌క్‌ల మీద మోజు పుట్టినట్లుంది. మసాలా, దృశ్యం, గోపాల గోపాల.. ఇలా వెంకీ చేసిన గత మూడు సినిమాలూ రీమేక్‌లే. వీటి తర్వాత ఛేంజ్ కోసం మారుతి దర్శకత్వంలో స్ట్రెయిట్ మూవీ చేస్తున్నాడు. కానీ ఇదయ్యాక మళ్లీ వెంకీ వరుసగా రీమేక్‌లే చేసేలా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం వెంకీ పేరుతో ఒకటి రెండు కాదు... నాలుగైదు రీమేక్‌లు వినిపిస్తుండటం విశేషం.

ఆల్రెడీ తమిళ, హిందీ భాషల్లో విజయవంతమైన ‘సాలా ఖడూస్’ రీమేక్‌లో నటించడానికి వెంకీ ఓకే చెప్పేసిన సంగతి తెలిసిందే. ఒరిజినల్‌కు దర్శకత్వం వహించిన సుధా కొంగరనే ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతోంది. మరోవైపు డాలీ దర్శకత్వంలో తమిళ లేటెస్ట్ హిట్ ‘సేతుపతి’ని తెలుగులోకి తేవడానికి కూడా వెంకీ ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక బండ్ల గణేష్ వెంకీ కోసమే ‘టు కంట్రీస్’ రీమేక్ హక్కులు తీసుకున్నాడు. ఐతే ఆ ప్రాజెక్టుపై ఏ సంగతీ తేల్చట్లేదు వెంకీ. మరోవైపు ఇంకో రెండు రీమేక్ సినిమాల కోసం వెంకీ కన్సిడరేషన్లో ఉన్నాడు. అందులో ఒకటి బాలీవుడ్ హిట్ మూవీ ‘పీకూ’ కాగా.. ఇంకొకటి మలయాళ హిట్ ‘భాస్కర్ ద రాస్కెల్’. మొత్తంగా ఐదు రీమేక్ సినిమాలు వెంకీ కోసం ఎదురు చూస్తున్నాయి. వీటిలో చివరికి ఎన్ని తెరమీదికి వస్తాయో.. వెంకీ ఏవి చేస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు