వాళ్లు లేపుతుంటే, వీళ్లు తొక్కేస్తున్నారు

వాళ్లు లేపుతుంటే, వీళ్లు తొక్కేస్తున్నారు

యుఎస్‌లో స్టార్లు లేని (పెద్ద హీరోలు), స్టార్లు పడని (రేటింగులు) సినిమాలకి కాసులు రాలవనేది తెలిసిన సంగతే. మైళ్ల కొద్దీ ప్రయాణం చేసి, భారీగా వుండే టికెట్‌ రేట్లని లెక్క చేయకుండా సినిమా చూడాలంటే ఆమాత్రం ఆచి తూచి వ్యవహరించడంలో వింతేమీ లేదు. ఒకప్పుడు కాస్తో, కూస్తో పేరున్న నటీనటుల సినిమాలకి మాత్రమే ఓవర్సీస్‌లో ముఖ్యంగా యుఎస్‌లో ఆదరణ వుండేది. దాంతో చిన్న సినిమాల్ని విడుదల చేయడానికి కూడా వెనకాడేవారు.

కానీ ఇప్పుడు సినిమా బాగుందనే టాక్‌ వస్తే, రేటింగ్స్‌ బాగా పడితే చిన్న చిత్రాలని కూడా ఆదరిస్తున్నారు. యుఎస్‌లో ఆడియన్స్‌ మంచి సినిమాలని లేపడానికి అంత పెద్ద మనసు చేసుకుంటూ వుంటే, లోకల్‌గా మాత్రం సినిమాలు బాగున్నా కానీ జనాలు సరిగ్గా చూడ్డం లేదు. కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రాన్నే తీసుకుంటే ఓవర్సీస్‌లో బ్లాక్‌బస్టర్‌ అయిన ఈ చిత్రం ఇక్కడ అబౌ యావరేజ్‌ ఫలితంతో సరిపెట్టుకుంది. అలాగే క్షణంలాంటి చిన్న చిత్రానికి యుఎస్‌లోనే పాతిక లక్షలకి పైగా షేర్‌ వస్తే ఇక్కడ ఉత్తరాంధ్రలో పది లక్షల షేర్‌ రావడానికి పది రోజులు పట్టింది.

మంచి టాక్‌ వచ్చింది కనుక ఇక్కడా పుంజుకుంటుందని ఎదురు చూస్తూ కూర్చుంటే ప్రేక్షకుల దృష్టి ఆల్రెడీ పక్క సినిమాల మీదకి మళ్లిపోయింది. మంచి సినిమాలు రావడం లేదని విమర్శించే జనం ఇలాంటి చిత్రాలని బాగా ఆదరిస్తేనే కదా, మరికొంతమంది అలాంటివి చేయడానికి ధైర్యం చేసేది?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు