క‌డ‌ప న‌మూనా.. కొంప ముంచేస్తుందా?

ఏపీ సీఎం జ‌గ‌న్ అనుస‌రిస్తున్న క‌డ‌ప న‌మూనా.. పార్టీని కొంప‌ముంచుతుంద‌నే వాద‌న బ‌లంగా వినిపి స్తోంది. తాను పుట్టిన గ‌డ్డ‌ను అద్భుత జిల్లాగా తీర్చి దిద్దుకోవాల‌ని భావిస్తున్న ముఖ్య‌మంత్రి.. ఆ విష‌యంలో అనుకున్న‌దానిక‌న్నా ఎక్కువ‌గా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తుండ‌డంతో వైసీపీలో ఈ విష‌యం తీవ్ర చ‌ర్చ‌నీ యాంశంగా మారింది. ఏ నాయ‌కుడికైనా.. త‌న సొంత ఊరును అభివృద్ధి చేసుకోవాల‌నే ఉంటుంది. తాను పుట్టిన గ‌డ్డ రుణం తీర్చుకోవాల‌నే ఉంటుంది. అయితే.. ఈ అభిలాష‌కు కూడా కొన్ని హ‌ద్దులు ఉంటాయి. పైగా.. ప్రాంతాల వారీ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న ప్ర‌జ‌ల మైండ్ సెట్‌ను అర్ధం చేసుకోకుండా.. ముందుకు సాగితే.. ఈ అభివృద్ధి ఆశించిన ప్ర‌యోజ‌నాల‌కు క‌డు దూరం కావ‌డంతోపాటు.. క‌ష్టాల్లోకి కూడా నెడుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

రాయ‌ల‌సీమ జిల్లాల నుంచి అనేక మంది ముఖ్య‌మంత్రులు అయ్యారు. అయితే.. ఇప్ప‌టికీ ఇక్క‌డి జిల్లాల్లో దుర్భిక్షం రాజ్య‌మేలుతూనే ఉంది. దీనికి సంబంధించిన కార‌ణాల‌పై అన్వేష‌ణ జ‌ర‌గాల‌ని.. త‌మ ప్రాంతాల‌ను అభివృద్ధి చేయాల‌ని ఇక్క‌డి ప్ర‌జ‌లు కోరుతున్న మాట నిజ‌మే. అయితే.. అస‌లు కార‌ణం మాట ఎలా ఉన్నా..కేవ‌లం త‌న జిల్లాను మాత్రం అభివృద్ధి చేసుకుంటే స‌రిపోతుంద‌నే ధోర‌ణిలో జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నేది కీల‌క విమ‌ర్శ‌. ఈ జిల్లాకు ఇప్ప‌టికే 35 వేల కోట్ల పెట్టుబ‌డుల‌ను స‌మీక‌రించారు. త్వ‌ర‌లోనే ఆయా ప్రాజెక్టుల‌కు జ‌గ‌న్ శంకుస్థాప‌న కూడా చేయనున్నారు. ప‌లితంగా నాలుగు ల‌క్ష‌ల పైచిలుకు యువ‌త‌కు ఉపాధి క‌లుగుతుంది.

ఈ ప‌రిణామం మంచిదే అయినా.. సీమ‌లోని నాలుగు జిల్లాల్లో కేవ‌లం ఒక్క జిల్లాపైనే ఇలా అభివృద్ధి విష‌యంలో ఫోక‌స్ చేయ‌డం ద్వారా.. మిగిలిన జిల్లాల ప‌రిస్థితి ఏంటి? ఆయా జిల్లాలు అభివృద్ది చెంద‌క‌పోతే.. మున్ముందు ప‌రిణామాలు ఎలా మార‌తాయి? అనే ఆలోచ‌న లేక‌పోవ‌డ‌మే వైసీపీ నేత‌ల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఇప్ప‌టికే సీమ ప్ర‌త్యేక రాష్ట్రం చేయాల‌ని కోరుతున్నారు. దీనికి మ‌ద్ద‌తు మాట ఎలా ఉన్నా.. ఇప్పుడు క‌డ‌ప‌లో అభివృద్ధి కేంద్రీకృత‌మైతే.. ఈ నినాదం మ‌రింత పుంజుకోద‌నే గ్యారెంటీ ఏమీలేదు. పైగా.. అనంత‌పురం జిల్లాలో ప‌రిస్థితి మ‌రింత దుర్భ‌రంగా ఉంది. ఇక‌, క‌ర్నూలులోనూ ప‌రిస్థితి ఆశాజ‌న‌కంగా ఏమీలేదని నివేదిక‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అభివృద్ధిని ఒకే చోట పోగుప‌డేలా చేయ‌కుండా.. వికేంద్రీక‌రించాల‌నేది వైసీపీ నేత‌లే చెబుతున్న మాట‌. మ‌రి జ‌గ‌న్ ప‌ట్టించుకుంటారా? అదిశ‌గా అడుగులు వేస్తారా? చూడాలి!