సోగ్గాడు వంద కాదు.. 110

సోగ్గాడు వంద కాదు.. 110

మొన్న 'సోగ్గాడే చిన్నినాయనా" థ్యాంక్స్ మీట్లో భాగంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. తన సినిమా వంద సెంటర్లలో యాభై రోజుల పండుగ చేసుకోబోతోందన్నాడు. మంచి టాక్ వచ్చిన సినిమా కూడా మూడు నాలుగు వారాలకే చాప చుట్టేస్తున్న ఈ రోజుల్లో వంద సెంటర్లలో 50 రోజులా అని అందరూ నోరెళ్లబెట్టారు. ఐతే నాగ్ చెప్పిన ఫిగర్ కంటే కూడా ఇంకో పది సెంటర్లలో అదనంగా 50 డేస్ పూర్తి చేసుకుంటోంది 'సోగ్గాడే చిన్నినాయనా". ఈ రోజుల్లో ఇది అద్భుతమైన రికార్డుగా చెప్పుకోవాలి. నాలుగో వారానికే రూ.50 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ సాధించి ఇప్పటికే సంచలనం సృష్టించిన నాగ్ మూవీ.. ఇప్పుడు 50 రోజుల సెంటర్ల విషయంలోనూ అబ్బురపరిచింది.

ఒక్క రాయలసీమలో మాత్రమే ఈ సినిమా 29 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. ఇక కృష్ణా జిల్లాలో అయితే ఏకంగా 17 సెంటర్లలో 50 రోజులాడేసిందీ సినిమా. హైదరాబాద్లో సైతం పదికి పైగా సెంటర్లలో సినిమా ఇంకా ఆడుతోంది. సంక్రాంతికి వచ్చిన మిగతా మూడు సినిమాలు 'సోగ్గాడే చిన్నినాయనా"కు దరిదాపుల్లో కూడా లేవు. ఉన్నంతలో 'నాన్నకు ప్రేమతో" బెటర్. ఆ సినిమా 16 సెంటర్లలో 50 రోజులాడింది. డిక్టేటర్ నామమాత్రంగా 3 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. 'ఎక్స్ప్రెస్ రాజా" కూడా అంతే. ఈ సినిమాలేవీ కూడా హైదరాబాద్ కాకుండా నైజాంలో ఇంకెక్కడా 50 డేస్ ఆడలేదు. కానీ నాగ్ మూవీకి మాత్రం ఈ ఏరియాలో కూడా ఇప్పటికీ చెప్పుకోదగ్గ సెంటర్లలో ఆడుతుండటం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు