సినిమా రివ్యూ: క్షణం

సినిమా రివ్యూ: క్షణం

సినిమా రివ్యూ: క్షణం
రేటింగ్‌: 3/5
తారాగణం: అడివి శేష్‌, ఆదా శర్మ, అనసూయ తదితరులు
సంగీతం: శ్రీ చరణ్‌
కెమెరా: షామియల్‌ డియో
ఎడిటర్‌: అర్జున్‌ శాస్త్రి
నిర్మాతలు: పరం పొట్లూరి, కెవిన్‌ అన్నే
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రవికాంత్‌ పేరెపు


ఆకట్టుకునే ప్రోమోలతో సందడి చేస్తూ గత రెండు నెలలుగా సినీ ప్రియుల నోళ్లల్లో నానుతోన్న క్షణం ఇప్పుడు థియేటర్లలోకి వచ్చింది. అడివి శేష్‌ హీరోగా నటించిన ఈ చిత్రంతో రవికాంత్‌ దర్శకుడిగా పరిచయమయ్యాడు. కోటి రూపాయల బడ్జెట్‌లో రూపొందిన ఈ చిత్రం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయింది. అంత తక్కువలో ఇంత క్వాలిటీ ఎలా తీసారంటూ ఇండస్ట్రీ వాళ్లు కూడా ఆరా తీస్తున్నట్టు తెలిసింది. మేకింగ్‌ పరమైన క్వాలిటీనే కాకుండా, సినిమా నిజంగానే క్వాలిటీగా తెరకెక్కింది. కథ, కథనం అన్నీ కొత్తగా అనిపిస్తూ, ఆద్యంతం సస్పెన్స్‌తో కట్టి పడేస్తాయి.

కథ:


రిషి (శేష్‌ అడివి) విదేశాల్లో సెటిలవుతాడు. అతనికో రోజు తన మాజీ ప్రేయసి శ్వేత (ఆదా శర్మ) నుంచి కాల్‌ వస్తుంది. ఇండియాకి వెళ్లిన రిషికి ఆమె కూతురు కిడ్నాప్‌ అయిందనే సంగతి తెలుస్తుంది. పోలీసులు నెల తిరగకుండా కేస్‌ క్లోజ్‌ చేసేసేసరికి అసలు ఏం జరిగి వుంటుందో తెలుసుకోవాలని రిషి కొన్ని క్లూస్‌ ద్వారా కొందరిని కలుస్తాడు. వారి ద్వారా శ్వేతకి అసలు పిల్లలే లేరనే సంగతి తెలిసి ఆమెని నిలదీసేసరికి ఆమె తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటుంది. నిజంగానే తన కూతురు కిడ్నాప్‌ అవడం వల్లే ఆమె చనిపోయిందని అర్థమై పాపని రక్షించడానికి పూనుకుంటాడు. అసలు ఆ పాపని కిడ్నాప్‌ చేసిందెవరు? ఎందుకు చేసారనేది మిగతా కథ.

కథనం:


ఆరంభంలోనే కిడ్నాప్‌ సీన్‌ పెట్టి దర్శకుడు క్షణం కూడా వృధా చేయకుండా కథలో లీనం చేసే పనిలో పడ్డాడు. కథలో చాలా కొత్త సంగతులున్నాయి. రొటీన్‌కి భిన్నంగా తన మాజీ ప్రేయసి పాప ఆచూకీ కోసమని ప్రియుడు తిరిగొస్తాడు. ఈ పాయింట్‌లో చాలా ఎమోషన్‌ వుంది. అతనికి ఆమెపై వున్న ప్రేమ తెలియజెప్పడంతో పాటు ఆమెకి అతనిపై వున్న నమ్మకాన్ని కూడా ఇది తెలియజేస్తుంది. మరి అలాంటి ఇద్దరూ ఎందుకు విడిపోయారు అనేది ఈ కథలో సబ్‌ ప్లాట్‌ అయింది. ఆ ప్రేమకథని ఒకేసారి చూపించకుండా కొంచెం కొంచెంగా చెప్పుకుంటూ వచ్చారు.

ప్రేమకథలో చెప్పుకోతగ్గ విషయం లేకపోవడంతో అంతా ఒకేసారి చూపిస్తే ఆడియన్స్‌కి బోర్‌ కొడుతుంది. అందుకే తెలివిగా దానిని ఆసక్తికరంగా సాగుతోన్న కిడ్నాప్‌ డ్రామా మధ్య ముక్కలు ముక్కలుగా ఇరికించారు. దీని వల్ల కొన్నిసార్లు మూడ్‌ దెబ్బ తిన్నా కానీ ఒకేసారి డిస్‌కనెక్ట్‌ అవకుండా హెల్ప్‌ అయింది. ఈ చిత్రాన్ని పరుగులు పెట్టించినట్టయితే బాగుండేది. కానీ మరీ నిదానంగా మొదలు పెట్టి ఇంటర్వెల్‌ దగ్గరకి వచ్చాక కానీ వేగం పెంచలేదు. స్పీడ్‌ కోరుకునే ప్రేక్షకులని ఈ పద్ధతి నిరాశ పరుస్తుంది. కానీ ఇంటర్వెల్‌ నుంచి కథనం వేగంగా సాగడం వల్ల ఆ వెలితి కొంత తీరుతుంది.

థ్రిల్లర్‌ సినిమా కనుక ఆ వేగం ఆసాంతం చూపించాల్సింది. ఎలాగో ప్రయోగానికి వెళ్లారు కనుక ఒక పావుగంట నిడివి తగ్గించుకుంటే ఇంకా క్రిస్ప్‌గా వుండేది. కిడ్నాప్‌ ఎవరు చేసారనే సస్పెన్స్‌ వుండడం వల్ల చివరి దాకా బోర్‌ అనిపించదు. దర్శకుడు సినిమాటిక్‌ లిబర్టీస్‌ తీసుకుని కొన్ని అసంబద్ధమైన సన్నివేశాలు చేర్చడం వల్ల క్లయిమాక్స్‌ కళ తప్పింది. ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని వుంటే ఇదో మరపురాని సినిమాగా నిలిచిపోయి వుండేది. ఇప్పటికీ ఒక్కసారి చూసేందుకు ఎలాంటి అభ్యంతరాలు అక్కర్లేదనుకోండి.

నటీనటులు:


శేష్‌ పాత్రకి తగ్గట్టు వున్నాడు. అతని నటన ఆకట్టుకుంటుంది. ఆదా శర్మ కూడా ఎమోషన్స్‌ బాగా పండించింది. ఆమెకి డబ్బింగ్‌ చెబుతున్న వ్యక్తిని మార్చాలి. అనసూయ తన టాలెంట్‌ మళ్లీ నిరూపించుకుంది. రాజేష్‌, వెన్నెల కిషోర్‌ బాగా చేసారు. సత్య, రవికాంత్‌ కూడా తమ వంతు సహకారం అందించారు.

సాంకేతికవర్గం:

దర్శకుడిలో ప్రతిభకి కొదవ లేదు. ఇతడినుంచి మరిన్ని మంచి చిత్రాలు ఆశించవచ్చు. టెక్నికల్‌గా సినిమా ఉన్నతంగా వుంది. పాటలు సోసోగా వున్నా కానీ నేపథ్యంలో వినిపించే సంగీతం కట్టి పడేస్తుంది. సినిమాటోగ్రాఫర్‌కి మంచి భవిష్యత్తు వుంది. ఇలాంటి ప్రయత్నాన్ని ప్రోత్సహించిన నిర్మాతలని అభినందించాలి.

చివరిగా...


థ్రిల్లర్స్‌, సస్పెన్స్‌ సినిమాలు ఇష్టపడే వారు తప్పక చూడాల్సిన చిత్రమిది. చిన్న సినిమా అనే అనుమానాలు లేకుండా బాగుంటుందనే నమ్మకంతో వెళ్లినా నిరాశ కలిగించకుండా పంపిస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు