పక్క చూపులు చూడొద్దంటున్న జగన్

పక్క చూపులు చూడొద్దంటున్న జగన్

వైసీపీ ఎమ్మెల్యలే గోడ దూకుళ్ల నేపథ్యంలో జగన్ కాస్త ఆలస్యంగా చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు. ఇప్పటికే కడప జిల్లా నేతలతో భేటీ అయిన ఆయన శుక్రవారం మరికొన్ని జిల్లాల నేతలతో సమావేశమై పరిస్థితిని సమీక్షించనున్నారు. వలసలు ఆపడంపై దృష్టి సారించిన ఆయన ఈ మేరకు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే అయిదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయారు. మొత్తం 30 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతారంటూ ఆ పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. దీంతో జగన్ కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. నష్ట నివారణకు గాను జిల్లాల వారీగా నేతలలో సమావేశమవుతున్నారు. గురువారం కడప జిల్లా నేతలను తన నివాసానికి పిలిపించుకుని చర్చలు జరిపారు. తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్న ఒత్తిళ్లేమిటి.. బెదిరిస్తున్నారా.. ప్రలోభ పెడుతున్నారా.... వైసీపీలో మీకేం తక్కువని వారిని ప్రశ్నించినట్లు సమాచారం.

ఈ రోజు గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన నేతలతో ఆయన సమావేశం కానున్నారు. వారిని హైదరాబాద్ లోని తన నివాసానికి రావాల్సిందిగా ఇప్పటికే కబురు పంపించారు. ఇతర పార్టీల వైపు... ముఖ్యంగా టీడీపీ వైపు పక్క చూపులు చూడొద్దని... వైసీపీకి మంచి భవిష్యత్ ఉందని చెప్పి వారి మనసులో ఏముందో తెలుసుకుని నమ్మకం కలిగించి నచ్చజెప్పి పార్టీలో కొనసాగేలా ప్రయత్నిస్తారని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు