ప్రయోగాత్మక సినిమానా సునీల్!

ప్రయోగాత్మక సినిమానా సునీల్!

కృష్ణాష్టమి.. కొత్త ఏడాదిలో వచ్చిన పరమ రొటీన్.. రొడ్డ కొట్టుడు సినిమా అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే మాస్ ఆడియన్స్ ఈ రొటీన్ వినోదాన్ని కొంత వరకు ఇష్టపడుతుండటంతో కలెక్షన్లు పర్వాలేదనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సక్సెస్ మీట్ పెట్టి తమ ఆనందాన్ని పంచుకున్నారు ‘కృష్ణాష్టమి’ యూనిట్ సభ్యులు. ఐతే ఈ వేడుకలో సునీల్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అందులో ప్రధానంగా ఓ మాట గురించి చెప్పాలి. ‘‘కృష్ణాష్టమి సక్సెస్ మరిన్ని ప్రయోగాలు చేయడానికి స్ఫూర్తినిచ్చింది’’.. ఇదీ సునీల్ చేసిన వ్యాఖ్య. అంటే కృష్ణాష్టమి ఓ ప్రయోగాత్మక చిత్రం అని సునీల్ భావిస్తున్నాడా.. ఇకపైనా ఇలాంటి ‘ప్రయోగాలే’ చేయాలనుకుంటున్నాడా? ఏంటో ఈ విడ్డూరం.

ఇక దిల్ రాజు సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం యూనిట్లో అందరి కంటే ఎక్కువ కష్టపడింది ఆయనేనని.. ఆ కష్టాన్ని మాటల్లో చెప్పలేనని అన్నాడు. ‘‘దిల్ రాజుగారు లేకుంటే ఈ సినిమా ఉండేది కాదు. నిర్మాతగా సినిమా తీశామా, రిలీజ్ చేశామా అని కాకుండా మా అందరి కంటే సినిమా సక్సెస్ కోసం కష్టపడ్డారు. ఈ సినిమాలో నన్ను డిగ్నైఫైడ్ గా చూపించడమే కాదు, కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. నేను హీరోగా చేసిన సినిమాలన్నింటిలో ఇదే పెద్ద బడ్జెట్ మూవీ. నాపై నమ్మకంతో ఇంత మంచి సినిమా ఇచ్చిన దిల్ రాజుగారికి థాంక్స్’’ అని సునీల్ అన్నాడు. ‘కృష్ణాష్టమి’ చూసి.. దిల్ రాజు బేనర్ నుంచి ఇలాంటి సినిమానా అని జనాలు అనుకుంటుంటే.. సునీల్ ఈ సినిమా క్రెడిట్ అంతా దిల్ రాజుదేననడంలో సెటైర్ లాగా లేదూ!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు