నాగ్.. ఇప్పుడు అసలైన కింగ్

నాగ్.. ఇప్పుడు అసలైన కింగ్

దాదాపు రెండు దశాబ్దాల పాటు తెలుగు తెరపై హవా నడిపించారు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. ఐతే 2000వ సంవత్సరం తర్వాత నెమ్మదిగా వాళ్ల హవా తగ్గడం మొదలైంది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి కథానాయకులకు క్రేజ్ పెరగడం.. ఈ సీనియర్ హీరోల ఊపు తగ్గుతూ రావడం ఒకేసారి జరిగింది. మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ మరీ తగ్గిపోకున్నా ఆయన రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో ఆయన ఉనికే లేకుండా పోయింది. ఇక మిగతా ముగ్గురు సీనియర్ల పరిస్థితి కూడా అటు ఇటుగా అయిపోయింది. కొడితే పెద్ద హిట్టు లేదంటే పెద్ద డిజాస్టర్ అన్నట్లు బాలయ్య పరిస్థితి తయారైతే.. నాగార్జున, వెంకటేష్లకు రాను రాను మార్కెట్ పడిపోతూ వచ్చింది.

ఇక సీనియర్ హీరోలు మళ్లీ రైజ్ కావడం కష్టమే అనుకుంటున్న సమయంలో నాగార్జున తన లీగ్లోని హీరోలకు పెద్ద ఉత్సాహాన్నే ఇచ్చాడు. 'సోగ్గాడే చిన్నినాయనా" సినిమాతో తన సత్తా ఏంటో చూపించాడు నాగ్. ఒకప్పుడు అభిమానులతో 'యువ సామ్రాట్" అని పిలిపించుకున్న నాగ్.. వయసు మళ్లాక అందుకు ఇష్టపడలేదు. 'కింగ్" సినిమా వచ్చాక తన పేరు ముందుకు ఆ పదాన్ని తనే చేర్చుకుని.. ఇకపై తనను అలా పిలవాలని అభిమానుల్ని కోరాడు.

ఐతే కింగ్ అని పెట్టుకున్నాడు కానీ.. బాక్సాఫీస్ దగ్గర 'కింగ్" లాగా హవా సాగించలేకపోయాడు నాగ్. గత కొన్నేళ్లలో ఆయన మాస్ ఇమేజ్ బాగా పడిపోయింది. సినిమాలు రిలీజైనపుడు ఒకప్పుడుండే ఊపు కొన్నేళ్లుగా లేదు. కానీ గత ఏడాది 'మనం" లాంటి మంచి సినిమా అందించి... ఈ ఏడాది 'సోగ్గాడే.." లాంటి మాస్ హిట్ కొట్టడంతో నాగ్ ఇప్పుడు నిజంగానే 'కింగ్" అయ్యాడు. యువ హీరోలకు తానేమీ తీసిపోనని చాటాడు. లేటెస్టుగా రిలీజైన 'ఊపిరి" టీజర్ చూస్తుంటే నాగ్ మరో హిట్టు ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి ప్రస్తుతం నాగ్ 30 ఏళ్ల కెరీర్లో ఇప్పుడున్నంత హైలో మరెప్పుడూ లేడంటే అతిశయోక్తి ఏమీ లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు