ఇండస్ట్రీ మోసం చేసిందంటున్న హీరోయిన్

ఇండస్ట్రీ మోసం చేసిందంటున్న హీరోయిన్

తన టాలెంటును ఇండస్ట్రీ జనాలు వాడుకోవట్లేదని తెగ ఫీలవుతోంది మలయాళ కుట్టి పూర్ణ. అవును, సీమ టపాకాయ్, మామ మంచు అల్లుడు కంచు లాంటి సినిమాలతో తెలుగులో మంచి పేరే సంపాదించిన పూర్ణకు.. సొంత గడ్డ మలయాళంలో చాలా అన్యాయం జరిగిందట. తన మాతృభాష మలయాళంలో కంటే తమిళం, తెలుగు భాషల్లోనే మంచి అవకాశాలు వస్తున్నాయని పూర్ణ అంటోంది.

మలయాళ రచయితలు, దర్శకులు కథలు వినిపించేటప్పుడు మంచి పాత్ర అని చెబుతున్నారని.. నిడివి కూడా ఎక్కువే అంటున్నారని.. కానీ షూటింగ్‌కు వెళ్లిన తర్వాత చిన్న వేషం ఇస్తున్నారని ఆమె వాపోయింది. పలు మలయాళ చిత్రాల్లో మంచి పాత్ర అని చెప్పి తనను మోసం చేశారని.. దీని వల్ల తాను చాలా బాధపడ్డానని పూర్ణ ఆవేదన వ్యక్తం చేసింది. ఇకపై మలయాళ సినిమాల్లో నటించకూడదన్నంత ఫ్రస్టేషన్ వచ్చేసిందని ఆమె చెప్పింది.

ఇక వేరే ఇండస్ట్రీల్లో సైతం తన మీద దుష్ప్రచారాలు ఎక్కువయ్యాయని పూర్ణ చెప్పింది. తెలుగులో తాను ఒక హార్రర్ కామెడీ సినిమాలో దయ్యంగా నటించానని.. కానీ అది చూస్తూ ఒకరు గుండెపోటుతో నటించడంతో దానికి తనే కారణం అంటూ ప్రచారం చేశారని ఆమె చెప్పింది. ఆ సినిమా ‘రాజు గారి గది’ అన్న సంగతి తెలిసిందే. అలాగే ఓ సినిమాలో తాను ప్రెగ్నెంట్‌గా నటిస్తే.. తాను నిజంగానే గర్భవతినంటూ రూమర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయని చెప్పింది.

ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేయడం అంటే బతికున్నవాళ్లను చంపేయడమే అని ఆమె ఆవేదన చెందింది. ఫేస్ బుక్ లాంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లను నిషేధించాలని ఎవరైనా గొంతెత్తితే దానికి తాను మద్దతు పలుకుతానని పూర్ణ అనడం గమనార్హం. తనకిప్పుడు 30 ఏళ్ల వచ్చేశాయని.. దీంతో ఇక పెళ్లి చేయాలని ఇంట్లో ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు పూర్ణ చెప్పింది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు