పవన్‌ కు బిపి పెంచేస్తున్న బయ్యర్లు..

పవన్‌ కు బిపి పెంచేస్తున్న బయ్యర్లు..

ఒకటా రెండా.. పవన్‌ పేరున కోట్లకు కోట్లు పోస్తున్నారు నిర్మాతలు. అంతే రేట్‌ పెట్టి కొంటున్నారు బయ్యర్లు. ఈయన కటౌట్‌ కనిపిస్తే చాలు.. డిస్ట్రిబ్యూటర్లు లెక్క లేకుండా కాసులు కుమ్మరిస్తున్నారు. ఇప్పుడు సర్దార్‌ సినిమాపై కూడా ఇలాంటి నమ్మకాన్ని చూపిస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. అసలు సినిమా ఎలా వస్తుందో తెలియదు.. రెండు టీజర్స్‌ వచ్చినా కథేంటో అస్సలు బయటికి రాలేదు. కానీ పవన్‌ కళ్యాణ్‌ ఉన్నాడన్న ఒక్క ధైర్యంతో సినిమాను ఆకాశమంత రేట్లకు అమ్మేస్తున్నారు నిర్మాతలు. ఇప్పటికే ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ 85 కోట్లకు చేరిందని సమాచారం.

డొమెస్టిక్‌, ఓవర్సీస్‌.. ఇలా ఇక్కడా అక్కడా అని తేడా లేదు. అన్ని చోట్లా సర్దార్‌ హవానే కనిపిస్తుంది. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ లో సరికొత్త రికార్డులు తిరగరాస్తోంది. ఓవర్సీస్‌ రైట్స్‌ 11 కోట్లకు అమ్మారు. ఇప్పటి వరకు కేవలం బాహుబలికి మాత్రమే 10 కోట్ల కంటే ఎక్కువ రేట్‌ పలికింది. అదంటే స్పెషల్‌ మూవీ. కానీ ఇప్పుడు సర్దార్‌ కూడా అదే స్థాయి బిజినెస్‌ చేస్తుండటం ఇప్పుడు అందర్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇది రికవర్‌ అవ్వాలంటే.. సినిమా రెండు మిలియన్‌ డాలర్లు వసూలు చేయాలి. ఇప్పటి వరకు బాహుబలి, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో మాత్రమే ఆ ఫీట్‌ సాధించాయి. ఇప్పుడు సర్దార్‌ పై కూడా ఆ బాధ్యత వేస్తున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ మార్కెట్‌ తో పోలిస్తే ఇది తక్కువే అని ఫీలవుతోంది ఎరోస్‌ సంస్థ. గతంలో పవన్‌ నటించిన గబ్బర్‌ సింగ్‌ 69 కోట్లు.. అత్తారింటికి దారేది 82 కోట్లు వసూలు చేసాయి. అప్పటికి నిర్మాతలకు ఆ సినిమాలు లాభాల పంట పండించాయి. అప్పటికి ఇప్పటికి పవన్‌ ఇమేజ్‌ రెండింతలు కాదు ఏకంగా నాలుగైదింతలు అయింది. ఇప్పుడున్న జోరుకు సర్దార్‌ పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంటే గనక 100 కోట్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ నమ్మకంతోనే సర్దార్‌ కు ఎంతైనా పెట్టడానికి ముందుకొస్తున్నారు బయ్యర్లు. మరి చూడాలిక.. సర్దార్‌ జోరు రిలీజ్‌ తర్వాత ఏ స్థాయిలో ఉంటుందో..? ఎప్రిల్‌ 8న సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ విడుదల కానుంది.

ఈ చిత్రానికి సంబంధించినంతవరకు పవన్‌ కళ్యాణ్‌ దే ఫైనల్‌ డెసిషన్‌. ఎందుకంటే కథ ఆయనే సమకూర్చుకున్నారు. తన టీంతో స్టోరీని డెవలప్‌ చేయించారు. ఆ తర్వాత బాబీ చేతికి డైరెక్షన్‌ పగ్గాలందించారు. ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ అందించేందుకే బాబీ అండ్‌ టీం అహోరాత్రులు కష్టపడుతున్నారట. ప్రీ రిలీజ్‌ బిల్డప్‌, బిజినెస్‌ బాగానే ఉన్నప్పటికీ... ఎంతగానో నమ్ముకున్న బయ్యర్లకు పవన్‌ ఎంతవరకు న్యాయం చేస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు