సుప్రీం ఫైర్‌ : కాంగ్రెస్‌ బికారేంటి?

సుప్రీం ఫైర్‌ : కాంగ్రెస్‌ బికారేంటి?

అధికారం ఉన్నపుడు అహంకారంతో అడ్డగోలు పనులు చేయడం, ప్రతిపక్షంలోకి వచ్చినాక బికారీ చూపులు చూడటం రాజకీయాల్లో మామూలు అయిపోయింది. పదవిలో ఉంటే ఒక తీరు, బయట ఉంటే మరొక తీరు అన్నట్లుగా వ్యవహరించడంలో పెట్టింది పేరు అయిన కాంగ్రెస్‌కు సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. తమ కోరిక తీరకపోగా చివాట్లు తినాల్సి వచ్చింది. ఇదంతా ప్రతిపక్ష హోదా కోసం కాంగ్రెస్‌ పడ్డ ఆరాటం విషయంలో జరిగింది.

2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 282 లోక్‌సభ స్థానాలు దక్కగా, కాంగ్రెస్‌కు 44 సీట్లు లభించిన సంగతి తెలిసిందే. లోక్‌సభలో పదిశాతం (55 సీట్లు) లేనందున కాంగ్రెస్‌ను ప్రతిపక్షపార్టీగా గుర్తించబోమని బీజేపీ తేల్చి చెప్పింది. ఇలా నిర్ణీత సంఖ్యాబలం లేకపోవడంతో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ప్రతిపక్ష నేతకు ప్రభుత్వం కేబినెట్‌ మంత్రికి సమానమైన హోదాను కల్పించడమే కాకుండా ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలను ప్రతిపక్షనేతతో చర్చిస్తుంది. ఈనేపథ్యంలో అవసరమైనంత సంఖ్యాబలం లేనప్పటికీ లోక్‌సభలో కాంగ్రెస్‌ను ప్రతిపక్ష పార్టీ గా గుర్తించాలని ఆ పార్టీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కోరగా ఆమె అటార్నీ జనరల్‌ అభిప్రాయం తీసుకుని కాంగ్రెస్‌ ప్రతిపాదనను తిరస్కరించారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ కొత్త అడుగు వేసింది. కాంగ్రెస్‌ పార్టీ నేతను లోక్‌సభలో ప్రతిపక్షనేతగా నియమించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ పార్టీ కార్యకర్త అయిన హెచ్‌ఆర్‌ జైన్‌తో సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజనాల పిల్‌ను దాఖలు చేయించింది. అయితే ఈ పిల్‌ను సుప్రీంకోర్టు జస్టిస్‌ దీపక్‌మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు తిరస్కరిస్తూ ఘాటు కామెంట్లు చేశారు. ''బాధిత వ్యక్తులు లేదా సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించగలిగే శక్తిసామర్థ్యాలు కలిగి ఉన్నప్పుడు ప్రజాప్రయోజనాల వ్యాజ్యం కింద వారి పిటిషన్‌ను స్వీకరించలేం'' అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు.

ప్రతిపక్ష హోదా దక్కడానికి 55 సీట్లు దక్కనప్పటికీ మొట్టమొదటి స్పీకరు హయాం నుంచి 60 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని పరిపాలిస్తుస్తున్నందున ఆ పార్టీకి లోక్‌సభలో ప్రతిపక్షనేత హోదాను కల్పించాలని కాంగ్రెస్‌ కోరుతోంది. నిబంధనలు ఒప్పుకోవని బీజేపీ స్పష్టం చేస్తూనే...గతంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 55 సీట్లు లేని కారణంగా బీజేపీకి 7సార్లు ప్రతిపక్ష హోదాను తిరస్కరించిందని గుర్తు చేస్తోంది. రాజకీయాల పరంగా ఈ వాదనలు నడుస్తున్న సమయంలోనే సుప్రీంకోర్టు పిల్‌ విచారణకు తిరస్కరించడంతో కాంగ్రెస్‌కు షాక్‌ తగిలినంత పనయింది. వందేళ్ల పైబడిన చరిత్ర మాదంటూ ఘన చరిత్రను గొప్పగా చెప్పుకునే కాంగ్రెస్‌ అటు కోర్టు పరిధలోనే కాకుండా ఇటు చట్టాల పరంగాను చులకనగా మారిపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు