అఖిల్‌కు న్యాయం చెయ్‌ నాగ్‌

 అఖిల్‌కు న్యాయం చెయ్‌ నాగ్‌

నాగార్జున, నాగచైతన్య కలిసి చక్కగా 'మనం' లాంటి మంచి సినిమా చేసుకున్నారు. ఆ తర్వాత నాగార్జున సింగిల్‌గా 'సోగ్గాడే చిన్నినాయనా' లాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్టు కొట్టాడు. నాగ్‌ కొత్త సినిమా 'ఊపిరి' మీద కూడా మంచి అంచానలే ఉన్నాయి. మరోవైపు నాగచైతన్య 'దోచేయ్‌' సినిమాతో ఇబ్బంది పడ్డా.. ప్రస్తుతం మజ్ను, సాహసం శ్వాసగా సాగిపో లాంటి క్రేజీ మూవీస్‌ చేస్తున్నాడు. అతడి కోసం మరిన్ని మంచి ప్రాజెక్టులు ఎదురు చూస్తున్నాయి. ఎటొచ్చీ నాగ్‌ చిన్న కొడుకు అఖిల్‌ పరిస్థితే అయోమయంగా ఉంది. అతడి డెబ్యూ మూవీ 'అఖిల్‌'కు గొప్ప హైప్‌ వచ్చింది కానీ.. సినిమాకు దారుణమైన ఫలితం రావడంతో అఖిల్‌ పాతాళానికి పడిపోయాడు.

ఇప్పుడిక రెండో సినిమా ఏది చేయాలో తెలియని సందిగ్ధంలో పడిపోయాడు అఖిల్‌. కోరుకున్న దర్శకులెవరూ ఖాళీగా లేరు. తమ దగ్గరికి వస్తున్న దర్శకులతో పని చేయడం ఇష్టం లేదు. దీంతో 'అఖిల్‌' విడుదలై మూడు నెలలు దాటుతున్నా ఇప్పటిదాకా రెండో సినిమా మొదలుకాలేదు. అసలు అఖిల్‌ రెండో సినిమా దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ముందు దర్శకుడిని ఫైనలైజ్‌ చేయడమే కష్టంగా ఉంది. 'అఖిల్‌' మూవీ విషయంలో నాగార్జున జడ్జిమెంట్‌ స్కిల్స్‌ మీదే సందేహాలు నెలకొన్నాయి. దీంతో రెండో సినిమా విషయంలో చాలా కన్ఫ్యూజ్‌ అయిపోతున్నాడు నాగ్‌. సీసీఎల్‌ ఉంది కదా.. ముందు అది కానివ్వండి అన్నాడు ఆ మధ్య అఖిల్‌ రెండో సినిమా గురించి అడిగితే. ఇప్పుడు ఆ టోర్నీ కూడా అయిపోయింది. 'సోగ్గాడే..' హడావుడికి కూడా తెరపడటంతో నాగ్‌ కూడా ఫ్రీ అయిపోయినట్లే. ఇప్పుడిక అఖిల్‌ను హీరోగా నిలబెట్టే పని మీద దృష్టిపెట్టాల్సిందే.