నాని.. ఈసారి నువ్వొక్కడివే కాదయ్యా

నాని.. ఈసారి నువ్వొక్కడివే కాదయ్యా

ఓ డైరెక్టర్‌ తన తొలి సినిమాతో ప్రశంసలైనా అందుకుంటాడు.. లేదా విమర్శలైనా తీసుకుంటాడు. కానీ హను రాఘవపూడి మాత్రం తన తొలి సినిమా 'అందాల రాక్షసి'తో గొప్ప ప్రశంసలు అందుకున్నాడు. అలాగే తీవ్ర విమర్శలూ తీసుకున్నాడు. కొందరా సినిమా చూసి.. చాలా పొయెటిగ్గా ఉందన్నారు.

ఇంకొందరు ఏంటీ సోది అని తిట్టిపోశారు. ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్‌ కాకపోయినప్పటికీ హనులో విషయం ఉందని.. ఏదో కొత్తగా చేయాలన్న తపన ఉందని మాత్రం టాలీవుడ్‌ జనాలు గుర్తించారు. ఐతే కేవలం క్రియేటివిటీ, టేస్టు చూపిస్తే సరిపోదని.. జనాల ఆమోదం పొందే సినిమా తీయడం కూడా ముఖ్యమని హను త్వరగానే గ్రహించాడు. రెండో సినిమాకే మెజారిటీ ప్రేక్షకుల ఆమోదం పొందే ఔట్‌ పుట్‌ అందించాడు.

నిన్న ఉదయం 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' రిలీజైనప్పటి నుంచి టాలీవుడ్లో హను పేరు మార్మోగిపోతోంది. మామూలుగా నాని సినిమాల్లో కంటెంట్‌ ఎంత బాగున్నా సినిమా చివరికి వచ్చేసరికి అందరికీ అతనే గుర్తుంటాడు. దర్శకుల్ని మరిచిపోతుంటారు. 'భలే భలే మగాడివోయ్‌' విషయంలోనూ అదే జరిగింది. ఆ సినిమాలో నాని కాకుండా మరొకరు ఉండుంటే ఆ సినిమా అంత పెద్ద హిట్టయ్యేది కాదన్నది అందరూ అంగీకరిస్తారు. '

కృష్ణగాడి వీర ప్రేమ గాథ'లోనూ నాని అద్భుతమైన పెర్ఫామెన్స్‌ ఇచ్చాడు. అతడు కాకుండా మరో హీరో కృష్ణ పాత్ర పోషించి ఉంటే అదంత పండేది కూడా కాదు. ఐతే ఓవరాల్‌గా సినిమా మొత్తాన్ని మాత్రం నాని భుజాల మీద మోయలేదు. ఇక్కడ డైరెక్టర్‌ కీలక పాత్ర పోషించాడు. నానితో ముడిపడని ఎపిసోడ్లను, సన్నివేశాల్ని కూడా చక్కగా తీర్చిదిద్దాడు. బ్రహ్మాజీ, పృథ్వీ, మురళీ శర్మ, ప్రభాస్‌ శీను పాత్రలతో కూడా బోలెడంత వినోదాన్ని పండించాడు. మొత్తంగా 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' డైరెక్టర్స్‌ ఫిల్మ్‌ అని చాటాడు. కాబట్టి ఈ సక్సెస్‌ క్రెడిట్‌ నానితో పాటు హనుకు కూడా ఈక్వల్‌గా దక్కుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు