ఒకే రోజు తెలుగులో, తమిళంలో కొట్టాడు

ఒకే రోజు తెలుగులో, తమిళంలో కొట్టాడు

ఒక అప్‌కమింగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ రెండు భాషల్లో చేసిన వేర్వేరు సినిమాలు ఒకే రోజు విడుదలవడం.. ఆ రెండూ కూడా హిట్టవడం.. మ్యూజిక్‌ విషయంలో అందరూ ప్రశంసలు కురిపించడం అరుదుగా జరిగే విషయం. ఈ అరుదైన ఆనందాన్నే ఆస్వాదిస్తున్నాడు విశాల్‌ చంద్రశేఖర్‌. ఈ శుక్రవారం తెలుగులో రిలీజైన 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ'కు.. తమిళ ప్రేక్షకుల ముందుకొచ్చిన 'జిల్‌ జంగ్‌ జక్‌'కు అతనే మ్యూజిక్‌ డైరెక్టర్‌. రెండు సినిమాలు కూడా పాజిటివ్‌ టాక్‌తో అదరగొడుతున్నాయి. ముఖ్యంగా ఈ రెండు సినిమాల మ్యూజిక్‌ గురించి ఆయా ఇండస్ట్రీల్లో చర్చ జరుగుతోంది. రెండు చోట్లా అప్లాజ్‌ అందుకుంటున్న విశాల్‌ ఆనందానికి అవధుల్లేవు.

తెలుగులో కృష్ణమాధవ్‌ హీరోగా నటించిన 'హృదయం ఎక్కడున్నది' అనే చిన్న సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు విశాల్‌. ఆ సినిమా అడ్రస్‌ లేకుండా పోవడంతో అతడి ప్రతిభ బయటికి రాలేదు. ఇలాంటి సమయంలో నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ సినిమాటోగ్రాఫర్‌ సంతోష్‌ శివన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇనామ్‌'కు మ్యూజిక్‌ అందించి వెలుగులోకి వచ్చాడు విశాల్‌. తర్వాత 'టైగర్‌' ఫేమ్‌ వీఐ ఆనంద్‌ దానికి ముందు తమిళంలో తీసిన 'అప్పూచి గ్రామమ్‌' అతడికి ఇంకా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆపై 'జిల్‌ జంగ్‌ జక్‌' విశాల్‌ పేరు మార్మోగిపోయేలా చేసింది. ఇందులోని పాటలు తమిళనాట సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయి. క్రియేటివ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అన్న ట్యాగ్‌ తెచ్చుకున్న విశాల్‌ను హను 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' ద్వారా తెలుగులోకి తీసుకొచ్చాడు. ఈ ఆడియో కూడా మంచి హిట్టయింది. యాదృచ్ఛికంగా విశాల్‌ పని చేసిన రెండు సినిమాలు ఒకేసారి రిలీజై హిట్‌ టాక్‌ సంపాదించడమే కాక.. అతడి సంగీతానికి కూడా మంచి పేరు తెచ్చిపెట్టాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు