నాకు ఇండస్ట్రీ కోట్లివ్వాలంటున్న డైలాగ్‌ కింగ్‌

నాకు ఇండస్ట్రీ కోట్లివ్వాలంటున్న డైలాగ్‌ కింగ్‌

మామూలుగా సినిమా నటుల్ని కదిపితే.. ఇండస్ట్రీకి తామెంతో రుణపడి ఉన్నామంటారు. కానీ సాయికుమార్‌ మాత్రం ఇండస్ట్రీనే తనకు రుణపడి ఉందని అంటున్నాడు. ఇండస్ట్రీ తనకు కొన్ని కోట్లు ఇవ్వాలని అతను ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

''సినీ పరిశ్రమలో మొహమాటం ఉండకూడదు. నేను ఆ మొహమాటం వల్లే చాలా పోగొట్టుకున్నాను. నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి. అవతలి వాళ్లు ఏమనుకుంటారో అనుకోకూడదు. మా నాన్న గారు  ముక్కుసూటి తనం వల్ల నష్టపోయారని.. నేను మరీ మెతకగా ఉన్నాను. దాని వల్ల చాలా నష్టం జరిగింది. నాకు ఇండస్ట్రీ కొన్ని కోట్లివ్వాలి. నా దగ్గర పెద్ద పెద్ద వాళ్లిచ్చిన బౌన్స్‌ చెక్కులు అలాగే ఉన్నాయి. నా జీవితంలో డబ్బులిస్తే గానీ డబ్బింగుకి రాను, షూటింగ్‌కు రాను అన్న రోజులు లేవు'' అని చెప్పాడు సాయికుమార్‌.

డబ్బింగ్‌ ఆర్టిస్టుగా స్టార్‌ ఇమేజ్‌ సంపాదించుకోవడం గురించి గుర్తు చేసుకుంటూ.. ''నేను డబ్బింగ్‌ చెప్పిన మొదటి సినిమా 'తరంగిణి'. దానికి 250 రూపాయలు వచ్చింది. ఆ సినిమా సూపర్‌ హిట్‌ కావటంతో తర్వాతి సినిమాకు పారితోషకం ఇంకో 250 రూపాయలు పెంచాను. దాంతో నన్ను తీసేశారు. పరుగెత్తుకుంటూ వెళ్లి తక్కువే ఇచ్చినా పర్లేదు చేస్తానని అడిగాను. కానీ వాళ్లు నాకు అవకాశం ఇవ్వలేదు. కానీ నన్ను తప్పించేసిన సినిమా ఆడలేదు.

దీంతో వాళ్లకు నేను సెంటిమెంటుగా మారాను. తర్వాత 'పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు' సినిమాకు 1,116 రూపాయలు ఇచ్చి నన్ను పెట్టుకున్నారు. అది ఆడింది. అలా 250 రూపాయల నుంచి డబ్బింగులో ఎవరూ అందుకోనంత అందుకునే వరకు వెళ్లాను. కానీ బాగా డబ్బులిచ్చే సమయానికి నేను డబ్బింగ్‌ చెప్పడం మానేశాను. నా గొంతు నాకే ఉండాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నాను.అది నేను చేసిన పెద్ద తప్పు.

నేను మానేశాక డబ్బింగ్‌ ఇండస్ట్రీ మరింత ఉన్నత స్థాయికి చేరుకుంది. మా అమ్మ చనిపోయాక ఆమె డైరీ చదివితే నేను డబ్బింగ్‌ చేయడం మానేయడం తప్పని రాసుకుంది. అది చదివి చాలా బాధేసింది'' అని సాయికుమార్‌ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు