ఏలూరు నీళ్లలో ఏం కలిసింది?

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖ పట్టణమైన ఏలూరు ప్రజలు నిన్నట్నుంచి భయభ్రాంతులకు గురవుతున్నారు. అక్కడి నీళ్లు కలుషితమై జనాల్లో విచిత్ర లక్షణాలు కనిపిస్తుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఏలూరు మున్సిపాలిటీ అందించే నీళ్లను ఎవరూ తాగొద్దంటూ జనాలకు హెచ్చరికలు జారీ అవుతుండటం కలకలం రేపుతోంది.

ఏలూరులో శుక్రవారం రాత్రి ముగ్గురు, శనివారం పదుల సంఖ్యలో మంది అస్వస్థతకు గురై, కళ్లుతిరిగి పడిపోవడంతో అక్కడి ప్రజల్లో భయం మొదలైంది. శనివారం రాత్రికే 100 మందికి పైగా అస్వస్థకు గురయ్యారు. వీరిలో 22 మంది చిన్నపిల్లలు, 40 మంది మహిళలు 33 మంది పురుషులు ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ఈ ఒరవడి కొనసాగుతుండటం, బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది.

మున్సిపాలిటీ నీళ్లు కలుషితం అయ్యాయని, వాటిని తాగిన వాళ్లే అస్వస్థతకు గురయ్యారని.. కాబట్టి ఎవ్వరూ ఆ నీళ్లు తాగొద్దని ఏలూరులో ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ రకంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వాట్సాప్‌లో కూడా ఈ మెసేజ్ ఫార్వార్డ్ అవుతోంది. బాధితుల్లో కొందరు మూర్చ లక్షణాలతో, ఇంకొందరు స్పృహ తప్పి పడిపోయే పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చారని వైద్యులు తెలిపారు. అలాగే వికారం, మానసిక ఆందోళనతో కూడా పలువురు ఆసుపత్రికి పరుగులు తీశారట.

ఏలూరులోని దక్షిణ వీధి, తూర్పు వీధి, అశోక్ నగర్, అరుంధతి పేట తదితర ప్రాంతాల్లో ప్రజలు ఆకస్మికంగా కళ్లు తిరిగి పడిపోవడం, వాంతులు, తలపోటు తదితర లక్షణాలతో శనివారం మధ్యాహ్నం నుంచి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరుతున్నారు. ఈ పరిణామాలపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. అస్వస్థత లక్షణాలు కనిపిస్తున్న వీధులకు అంబులెన్సులు పంపింది. ఇలా జరగడానికి కచ్చితమైన కారణాలేంటో ఇంకా అధికారులు తేల్చలేదు.